గద్వాల యువతికి ప్రతిష్ఠాత్మక పురస్కారం
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:26 PM
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన యువతి ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు.
- నాయక్ రస్తోగి అవార్డుకు ఎంపికైన కొంకతి ప్రీతి
- ఉత్తర్వులు జారీ చేసిన ఐఐటీ బాంబే డైరెక్టర్ శిరీష్ కేదారే
గద్వాల సర్కిల్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి) : జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన యువతి ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. దివంగత జరీ చీరల వ్యాపారి కొంకతి సుదర్శన్ కుమార్తె డాక్టర్ కొంకతి ప్రీతి ‘జియో ఇన్ఫార్మాటిక్స్ ఫర్ నేచురల్ రీసోర్సెస్ ఇంజనీరింగ్’ అనే అంశంపై పీహెచ్‌డీ చేశారు. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ రంగ పరిశోధనల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఐఐటీ బాంబే వారు ఇచ్చే ప్రతిష్ఠాత్మక నాయక్ రస్తోగి పురస్కారానికి ఎంపికయ్యింది. ఈ మేరకు ఐఐటీ బాంబే డైరెక్టర్ శిరీష్ కేదారే ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రీతి కుటుంబ సభ్యులు మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఈ పురస్కారం తమ కుమార్తెకు దక్కడం చాలా గర్వంగా ఉందని ఆమె తల్లి మాధవి సంతోషం వ్యక్తం చేశారు. ఐఐటీ బాంబేలో ఈ నెల 24న నిర్వహించనున్న కాన్వకేషన్ వేడుకల్లో ప్రీతికి పురస్కారం ప్రదానం చేయనున్నారని తెలిపారు. అయితే ప్రస్తుతం ఆమె అమెరికాలోని మిట్టి ల్యాబ్స్ లిమిటెడ్‌లో రిమోట్ సెన్సింగ్ లీడ్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నందున కాన్వకేషన్‌కు హాజరు కాలేకపోతున్నదని చెప్పారు. అమెరికా నుంచే వర్చువల్‌గా పురస్కారాన్ని స్వీకరించనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఐఐటీ డైరెక్టర్ శిరీష్ కేదారే, విభాగాధిపతి, ప్రొఫెసర్ సూర్య దుర్భాలకు ప్రీతి, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.