ముఖ్యమంత్రి పర్యటనకు ముమ్మరంగా ఏర్పాట్లు
ABN , Publish Date - May 12 , 2025 | 11:23 PM
ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని ప్రారంభించేందుకు నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మాచారం గ్రామంలో ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్నారు.
- 50 ఎకరాల విస్తీర్ణంలో 13 బోర్ల డ్రిల్లింగ్
- మాచారంలో సభా ప్రాంగణం, హెలీప్యాడ్ పనులను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే
మన్ననూర్, మే 12 (ఆంధ్రజ్యోతి) : ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని ప్రారంభించేందుకు నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మాచారం గ్రామంలో ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. కలెక్టర్ బదావత్ సంతోష్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సోమవారం మాచారం గ్రామాన్ని సందర్శించారు. చెంచు గిరిజనుల మెరుగైన జీవనం కోసం చేపట్టే ఇందిరా సౌర గిరిజల వికాసం పథకానికి సంబంధించి పనులను వేగంగా చేపట్టాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సీఎం సభా స్థలం, హెలీప్యాడ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆర్‌వోఎఫ్‌ఆర్‌కు సంబంధించిన 50 ఎకరాల విస్తీర్ణంలో గల భూముల్లో 13 ప్రదేశాల్లో బోర్లను డ్రిల్లింగ్ చేశామని, నీళ్లు పుష్కలంగా పడ్డాయని కలెక్టర్ తెలిపారు. రెడ్కో అధికారులు బోర్లకు సౌర విద్యుత్‌ను అందించే పనులను కొనసాగిస్తున్నారని చెప్పారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు రైతుల పొలాల్లో పండ్ల మొక్కలు నాటడానికి మార్కింగ్ చేసి గుంతలు తీసే పనులు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.10 లక్షల పోడు వ్యవసాయం చేసే చెంచు గిరిజన రైతులకు మేలు జరిగే కార్యక్రమం సీఎం పుట్టి పెరిగిన గడ్డ నుంచే ప్రారంభించడం హర్షణీయమని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో, ఐటీడీఏ ఇన్‌ఛార్జి పీవో రోహిత్ గోపిడి, డీటీడీవో ఫిరంగి, భూగర్భ జల శాఖ ఏడీ దివ్య, డీపీవో రామ్మోహన్‌రావు, డీఎస్పీ శ్రీనివాసులు, ఉద్యానవన శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.