Share News

ఆహ్లాదం.. ఆధ్యాత్మికం

ABN , Publish Date - Jul 24 , 2025 | 11:27 PM

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మునిసిపాలిటీలోని బాదేపల్లి పెద్దగుట్టను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదవాతావరణం ఏర్పడనుంది.

ఆహ్లాదం.. ఆధ్యాత్మికం
శ్రీరంగనాయకస్వామి మూలవిరాట్‌

- బాదేపల్లి పెద్దగుట్ట అభివృద్ధి చేస్తే మరో పర్యాటక కేంద్రం

- పెద్దగుట్టపై వెలిసిన శ్రీరంగనాయకస్వామి

- సొరంగాలు, గుహలతో ఉన్న గుట్ట

- నేటి నుంచి శ్రావణమాస ఉత్సవాలు

జడ్చర్ల, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మునిసిపాలిటీలోని బాదేపల్లి పెద్దగుట్టను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదవాతావరణం ఏర్పడనుంది. అందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం, పర్యాటక కేంద్రంగా చేపట్టాల్సిన చర్యలపై సర్వే సైతం నిర్వహించారు. కానీ ఆ దిశగా అడుగు పడటం లేదు.

సుమారు 8 ఎకరాలకు పైగా స్థలం

బాదేపల్లి పాతబజారు సమీపంలోని రంగనాయకస్వామిగుట్టపై దాదాపు 8 ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలంలోనే స్వయంభుగా వెలిసిన రంగనాయకస్వామి ఆలయం ఉంది. ఆలయం వద్ద ఆహ్లాదకరంగా కోనేరు ఉంది. కప్పగుండుతో పాటు పెద్దగుండ్లు ఉన్నాయి. ప్రస్తుతం కప్పగుండు వద్ద వేంకటేశ్వరస్వామి నామాలు ఏర్పాటు చేయగా, వాటికి అమర్చిన లైటింగ్‌తో రాత్రి వేళల్లో సుమారు 30 నుంచి 40కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది. మరో వైపు నామాలను ఏర్పాటుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. పెద్దగుట్టకుపైకి వెళ్లే మార్గం నుంచి పెద్దగుట్టపై దేవాలయాలు ఉన్నాయి. గుట్టపై పర్యాటక కేంద్రంగా మారిస్తే ఆ గుట్టకు మరింత శోభకలగనుంది.

స్వామి విగ్రహంపై నిలవని పైకప్పు

పెద్దగుట్టపై రంగనాయకస్వామి స్వయంభువుగా వెలిశాడు. ఆలయంలో రంగనాయకుడు లక్ష్మీసమేతంగా శేషతల్పంపై ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా సేదతీరుతున్న ప్రసన్నమూర్తిగా దర్శనమిస్తాడు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయంలోని మూలవిరాట్‌పై పైకప్పు నిలవదు. వేసినా అది నిలబడదని పెద్దలు చెప్తుంటారు. కొందరు నిర్మించేందుకు ప్రయత్నించినా సాధ్యం లేదని తెలిసింది. వెనకభాగంలో పెద్దగుండుకు కాలభైరవుడు, అమ్మవారి రూపాలు వెలిశాయి. పెద్దగుట్టకు వెళ్లేందుకు మెట్ల మార్గం, మరో వైపు వాహనాలు వెళ్లేలా రోడ్డు ఉంది. పెద్దగుట్టకు వెళ్లే మెట్ల మార్గం వద్ద గుహలో వీరభద్రుడి ఆలయం ఉంది. మెట్లమార్గం పక్కనే శివాలయం, గుట్టకు ముందు భాగంలో నామాలగుండు ప్రత్యేకం. ఆ ప్రాంతంలో చెన్నకేశవస్వామి ఆలయం ఉంది.

గుహలు, సొరంగ మార్గాలు..

రంగనాయకస్వామిగుట్టపై నుంచి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం వరకు, అలాగే గంగాపురం సమీపంలోని కోడుపర్తి గ్రామంలో ఉన్న ఆలయం వరకు సొరంగమార్గాలు ఉన్నాయని పెద్దలు చెప్తుంటారు. పెద్దగుట్టపై ఉన్న నుంచి గుట్ట మధ్యలోకి వచ్చేవిధంగా గుహలు ఉన్నాయి. ఆ గుహలలో వెలుతురు పడడంతో పాటు గాలి సైతం వీస్తుంది. దీంతో మేకలు, గొర్రెలను మేపేందుకు వెళ్లే వారంతా ఆ గుహలలో సేదతీరేవారని స్థానికులు తెలిపారు. పలు ప్రాంతాలలో చోరీలు చేసిన సొమ్ముతో గుట్టపై ఉన్న ఓ గుహలో దాక్కునేవారని, ఆ గుహను నేటికీ దొంగల గుహగా పిలుస్తారని స్థానికులు చెపుతారు.

నేటి నుంచి శ్రావణమాస ఉత్సవాలు

ప్రతీ ఏడాది గుట్టపై శ్రావణమాసంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. దేవాలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గుట్టపై వెలిసిన స్వామిని దర్శించుకునేందుకు జడ్చర్ల పరిసర ప్రాంత ప్రజలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. గుట్టపైకి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు కూర్చునేందుకు షెడ్‌ నిర్మాణం చేపట్టారు.

నెల రోజుల పాటు ఉత్సవాలు

రంగనాయకస్వామికి శ్రావణమాసంలో నెలరోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. కొన్ని వందల సంవత్సరాలుగా కేవలం శ్రావణమాసంలోనే స్వామి వారికి ఉత్సవాలు నిర్వహిస్తారు. గతేడాది స్వామి వారిని దర్శించుకునేందుకు లక్ష అడుగులు కార్యక్రమం నిర్వహించాం. ఈ సంవత్సరం దంపతులు వచ్చి స్వామి వారికి పూజలు నిర్వహించే వారికి ప్రతీ రోజు లక్కీడ్రా నిర్వహిస్తున్నాము. డ్రాలో గెలుపొందిన జంటకు మాత్రమే పట్టువస్త్రాలను బహుమతిగా ఇవ్వనున్నాము. స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తే కోరికలు తీర్చుతాడన్న నానుడి ఉంది.

- కాల్వ రాంరెడ్డి, దేవాలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు

Updated Date - Jul 24 , 2025 | 11:27 PM