Share News

20 ఏళ్లకు సరిపడా విద్యుత్‌ ఉతత్తికి ప్రణాళికలు

ABN , Publish Date - Aug 03 , 2025 | 11:39 PM

హైడల్‌ పవర్‌తో పాటు పంప్‌డ్‌ స్టోరేజ్‌తో విద్యుత్‌ ఉత్పత్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

 20 ఏళ్లకు సరిపడా విద్యుత్‌ ఉతత్తికి ప్రణాళికలు
అధికారులతో సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

- పంపుడ్‌ స్టోరేజీని వినియోగంలోకి తేవాలి

- ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

కొల్లాపూర్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : హైడల్‌ పవర్‌తో పాటు పంప్‌డ్‌ స్టోరేజ్‌తో విద్యుత్‌ ఉత్పత్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని సోమశిల లలితాంబిక సోమే శ్వర ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జెన్‌కో, ట్రాన్స్‌కో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జూరాల నుంచి పులిచింతల వరకు కృష్ణానది మీద ఉన్న హైడల్‌ పవర్‌ ప్రాజెక్టులను సమీక్ష చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అవసరమైతే ప్రపంచ పేరుగాంచిన కన్సల్టెంట్‌ల సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. సోలార్‌ ద్వారా పగలు జరిగే ఉత్పత్తిని స్టోరేజ్‌ చేసి రాత్రివేళ ఉపయోగానికి అవసరమైన సాంకేతికతను దానికి అవసరమైన స్టోరేజ్‌ వ్యవస్థను రూపొందించుకోవాలని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 1978లోనే ముందు చూపుతో అత్యాధునికమైన సాంకేతికతను పరిచయం చేసిందని తెలిపారు. రాబోయే తరాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యావరణ హితమైన పవర్‌ను ఉత్పత్తి చేసి అందించాలని అధికారులకు సూచించారు. ఈ ఏడాది నిరంతరాయంగా డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ను అందించిన సిబ్బంది ని అభినందించారు. సీఎండీ నుంచి కింది స్థాయి సిబ్బంది దాకా వారికి అవసరమైన సాంకేతికతను పెంపొందించుకోవడానికి అవసరమైన సిలబస్‌ రూపకల్పనతో పాటు అవసరమైన నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. గ్రీన్‌ హైడ్రోజన్‌, ఫ్లోటింగ్‌ సోలార్‌, రూఫ్‌ సోలార్‌, థర్మల్‌ పవర్‌, పవన విద్యుత్‌, అణు విద్యుత్‌ బ్యాటరీ స్టోరేజ్‌ లాంటి ప్రత్యామ్నాయ విద్యుత్‌ కోసం వినియోగాన్ని ఎక్కువ మొత్తంలో అభివృద్ధి చేసుకోవాలని అన్నారు.

Updated Date - Aug 03 , 2025 | 11:39 PM