ఫార్మా కుంపటి! - ఖాళీ స్థలాలనూ వదలని పరిశ్రమలు
ABN , Publish Date - Oct 23 , 2025 | 11:14 PM
అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కలిగిన ఫార్మా పరిశ్ర మల నుంచి వెలువడుతున్న నీటితో భూగర్భ జలాలు, పంట పొలాలు, చెరువులు, కుంటలు కాలుష్యం బారిన పడ్డాయి.
- వ్యర్థాలను కుప్పలుగా పోసి నిప్పు
- హెచ్చరించినా మారని యాజమాన్యాల తీరు
- ఇదీ పోలేపల్లి సెజ్‌లోని పరిస్థితి
- కాలుష్యంతో రోగాల బారిన పడుతున్నామంటున్న గ్రామస్థులు
జడ్చర్ల, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కలిగిన ఫార్మా పరిశ్ర మల నుంచి వెలువడుతున్న నీటితో భూగర్భ జలాలు, పంట పొలాలు, చెరువులు, కుంటలు కాలుష్యం బారిన పడ్డాయి. ప్రస్తుతం అవే ప రిశ్రమలు ఖాళీ స్థలాలను సైతం వదలడం లే దు. పరిశ్రమలలోని వ్యర్థాలను టీఎస్‌ఐఐసీ ప్రాంగణంలో ఉన్న ఖాళీ స్థలంలో కుప్పలుగా పోసి నిప్పంటిస్తున్నారు. దీంతో పాటు వాతా వరణం కలుషితమవుతోంది. పంట పొలాలు, చెరువులు కాలుష్యం బారిన పడే విధంగా వ్యవహ రిస్తున్న ఫార్మా పరిశ్రమ ను కాల్చివేస్తానంటూ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఇటీవల హెచ్చరించినా వారని తీరు మారడం లేదు. విడతల వారీగా ఆ కుప్ప లకు నిప్పంటి స్తున్నారు. దీం తో వ్యర్థాలను కాల్చడంతో వ స్తున్న పొగతో రోగాల బారిన పడుతున్నామంటూ పోలేపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భూగర్భజలాలు కలుషితం అయ్యాయని, పంటలు పండించుకునేందుకు వీ లులేని విధంగా వ్యవసాయ క్షేత్రాలు కాలుష్యం బారిన పడ్డాయని, చెరువులు-కుంటలలో పెం చుకుం టున్న చేపలు సైతం కాలుష్యం నీటితో మృతి చెందాయని వాపోతున్నారు. పోలేపల్లి గ్రామానికి అతి సమీపంలో ఉన్న టీఎస్‌ఐఐసీ ఖాళీ స్థలంలో వ్యర్థాలను డంపింగ్ చేయడం, నిప్పంటించడంతో వస్తున్న పొగ కారణంగా అనారోగ్యానికి గురవుతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను వెంటనే అరి కట్టాలంటూ వేడుకుంటున్నారు.
అలర్జీలకు గురవుతున్నాం..
- కేశవాచారి, పోలేపల్లి
ఫార్మాపరిశ్రమల వ్యర్థాలను టీఎస్ ఐఐసీలోని ఖాళీ స్థలంలో కుప్పలుగా పోసి నిప్పటించ డంతో కాలుష్యం పొగతో ఇప్పటికే అలర్జీ వ్యాధులకు గురవు తున్నాం. పోలేపల్లి గ్రామానికి అతి సమీపంలో వ్యర్థాలను కాల్చుతుండడంతో వస్తున్న దుర్వాసనతో శ్వాసకోశ వ్యాధు లకు గురవుతున్నాం. వ్యర్థాలను కాల్చుతున్న స్థలానికి సమీపం లో శ్మశాన వాటిక ఉంది. అదే ప్రాంతంలో ఉన్న బోర్లలో నీరు క లుషితమవుతోంది. మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడి నప్పుడు ఆ బోర్ల నుంచే నీళ్లు సరఫరా చేస్తున్నారు. దీంతో ఆందోళనకు గురవుతున్నాం.
శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి
- నక్కా రాఘవేందర్, పోలేపల్లి
టీఎస్‌ఐఐసీలోని ఖాళీ స్థలంలో పోలేపల్లి సెజ్‌లోని ఫార్మా పరిశ్రమల నుంచి వ్యర్థాలను కుప్పలుగా పోసి నిప్పంటిస్తుండడంతో వచ్చే పొగతో ఇప్పటికే గ్రామంలో కొందరు శ్వాసకోశ వ్యాధుల బారిన పడ్డారు. వ్యర్థాలను కాల్చవద్దన్న వారిపై ఫార్మా పరిశ్రమలకు చెందిన కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
దట్టంగా వచ్చే పొగతో తీవ్ర ఇబ్బందులు
- యాదయ్య, పోలేపల్లి
వ్యర్థాలకు నిప్పంటించడంతో దట్టంగా వస్తున్న పొగతో గ్రామంలో బయట తిరగలేకపోతున్నాం. ఇప్పటికే భూగర్భజలాలు, పంటపొలాలు కలుషితం అయ్యాయి. సెజ్‌లోని ఫార్మా పరిశ్రమల నుంచి పొడిగా ఉన్న వ్యర్థాలను టీఎస్‌ఐఐసీలోని ఖాళీ స్థలంలో కుప్పలుగా పోసి నిప్పంటిస్తున్నారు. ఈ కాలుష్యం బారిన పడి గ్రామస్థులు ఇప్పటికే అనారోగ్యానికి గురవుతున్నారు. పెద్ద ప్రమాదం జరగకుముందే నివారించాలి.