Share News

పీఎఫ్‌ సొమ్ము స్వాహా..!

ABN , Publish Date - Nov 05 , 2025 | 11:19 PM

ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ చెల్లించకుండా పలు ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలు స్వాహా చేస్తున్నాయి.

పీఎఫ్‌ సొమ్ము స్వాహా..!

- ప్రావిడెంట్‌ ఫండ్‌ సొమ్మును దోచుకుంటున్న ఏజెన్సీలు

- ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికులకు టోకరా

- రాజకీయ నాయకుల అండదండలు!

- పట్టించుకోని జిల్లా యంత్రాంగం!

వనపర్తి వైద్యవిభాగం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ చెల్లించకుండా పలు ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలు స్వాహా చేస్తున్నాయి. వనపర్తి జిల్లా వ్యాప్తంగా దాదాపు 20 వరకు ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల నిర్వాహణ కొనసాగుతుండగా, అందులో 2 వేల మందికిపైగా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం నుంచి మొత్తం డబ్బులు పొందుతూ ఉద్యోగుల వాటా ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ మాత్రం చెల్లించడం లేదు. ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల పనితీరుపై అధికారుల పర్యవేక్షణ కొరవడటం వల్లే ఇలా జరుగుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా లక్షలాది రూపాయలను ఏజెన్సీలు స్వాహా చేస్తుండటం గమనార్హం.

దాదాపు 15 విభాగాల్లో..

జిల్లా వ్యాప్తంగా దాదాపు 15 విభాగాల్లో ఏజెన్సీల నిర్వాహణ కొనసాగుతోంది. వాటి ద్వారా దాదాపు 2 వేలమందికి పైగా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వరిస్తున్నారు. ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఉద్యోగులను నియమించుకున్న ఏజెన్సీలు వారికి వేతనంతో పాటు ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌లను ప్రతీ నెల తప్పనిసరిగా జమ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల బేసిక్‌ వేతనం నుంచి ఈపీఎఫ్‌ 12 శాతం, ఏజెన్సీల నిర్వాహకులు 13 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఈఎస్‌ఐ కూడా ఇదే విధంగా ఉంటుంది. కానీ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఏజెన్సీలు మాత్రం నిబంధనలను తుంగలో తొక్కి ఉద్యోగుల కడుపు కొడుతున్నాయి. ఏజెన్సీల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పని చేసే సిబ్బంది ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు.

జిల్లాలో ఇది పరిస్థితి

కలెక్టరేట్‌, మెడికల్‌ కళాశాల, నర్సింగ్‌ కళాశాల, జీజీహెచ్‌, ఎంసీహెచ్‌, టీ హబ్‌, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, బ్లడ్‌ బ్యాంక్‌, ఐఎన్‌పీఆర్‌, మున్సిపాలిటీలు ఇలా అనేక చోట్ల ఏజెన్సీల నిర్వహణ కొనసాగుతుంది. వాటి ద్వారా 2 వేలమందికి పైగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 20 మంది ఎన్‌హెచ్‌ఎం కింద ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు 2023 మార్చి నెలలో విధుల్లో చేరారు. వారికి దాదాపు ఏడాదికిపైగా పీఎఫ్‌ డబ్బులు జమ కాలేదు. అంతేకాకుండా కలెక్టరేట్‌లో ఉన్న కొందరికి, టీహబ్‌లోని ఫార్మసిస్టుకు, డాటా ఎంట్రీ ఆపరేటర్‌కు, బ్లడ్‌ బ్యాంక్‌లో ఉన్న ఉద్యోగులకు పీఎఫ్‌ డబ్బులు చెల్లించలేదు. ఆ సొమ్మును ఏజెన్సీలు స్వాహా చేస్తుంటే అధికారులు మాత్రం అటు వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా ఏజెన్సీల నిర్వాహకులకు పుష్కలంగా రాజకీయ అండదండలు ఉండటంతో ఉద్యోగులు తమ సమస్యను ప్రస్తవిస్తే తొలగిస్తారేమోననే భయంతో గమ్మునుంటున్నారు.

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

భరత్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు : కంపెనీ యజమానులు సక్రమంగా పీఎఫ్‌, ఈఎస్‌ఐ చెల్లించాలి. జిల్లాలో కొందరు ఏజెన్సీల నిర్వాహకులు సక్రమంగా పీఎఫ్‌, ఈఎస్‌ఐ చెల్లించడం లేదు. దీంతో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు ఉద్యోగులకు వేతనాలే సక్రమంగా అందడం లేదు. ఇక పీఎఫ్‌, ఈఎస్‌ఐ ఊసే ఉండటం లేదు. ప్రతీ నెలా వేతనాలతో పాటు, క్రమం తప్పకుండా పీఎఫ్‌ జమ చేయాలి.

అధికారులు పట్టించుకోవడం లేదు

పి. సురేశ్‌, రాష్ట్ర కార్యదర్శి, మెడికల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ : ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలు పీఎఫ్‌ చట్టానికి తూట్లు పొడుస్తున్నా కార్మికశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లా పరిధిలో ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల యజమాన్యాలు పీఎఫ్‌, ఈఎస్‌ఐ సక్రమంగా చెల్లించకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు. వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, ఏజెన్సీల గుర్తింపును రద్దు చేయాలి.

Updated Date - Nov 05 , 2025 | 11:20 PM