అనుమతులు రద్దు చేయాలి
ABN , Publish Date - Apr 29 , 2025 | 11:27 PM
మహబూబ్‌నగర్ జిల్లాలో స్పౌజ్ పాయింట్లను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 7గురు సెకండరీ గ్రేడ్ టీచర్లపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం అయ్యింది.
- స్పష్టం చేసిన సిరిసనగండ్ల గ్రామస్థులు, రైతులు
- మైనింగ్‌పై ప్రజాభిప్రాయ సేకరణ
చారకొండ, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి) : బ్లాక్ గ్రానైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని సిరసనగండ్ల గ్రామస్థులు, రైతులు అధికారులను కోరారు. నాగర్‌కర్నూల్ జిల్లా, చారగొండ మండలంలోని సిరసన గండ్ల సమీపంలో 182 సర్వే నెంబర్‌లోని 7.7 హెక్టార్లలో బ్లాక్ గ్రానైట్ తవ్వకాలకు ఎండీ మహమ్మద్ హజీమొద్దీన్ గతంలో అనుమతులు పొందారు. ఆ మేరకు మైనింగ్ క్వారీ నిర్వహణ, పర్యావరణ ప్రభావంపై మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి ఇన్‌స్పెక్టర్ సురేశ్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కల్వకుర్తి ఆర్డీవో శ్రీను, తహసీల్దార్ సునీత హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, రైతులు మాట్లాడుతూ గ్రానైట్ తవ్వకాలతో తమ కడుపులు కొట్టొద్దన్నారు. దుమ్ము, ధూళితో పంటలు నాశనం ఆవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. భారీ శబ్దాలతో ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ మైనింగ్ క్వారీ నిర్వహణతో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. స్వచ్ఛ చలం కోసం ఆర్‌వో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మైనింగ్ చేయడం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని చెప్పారు. అలాగే మైనింగ్ పరిసరాల్లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. అలాగే గ్రామపంచాయతీ అభివృద్ధికి ప్రతీ సంవత్సరం రూ. 3 లక్షలు కేటాయించనున్నట్లు చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణపై నివేదికను రూపొందించి, కలెక్టర్‌కు అందించనున్నట్లు ఆర్డీవో తెలిపారు. ఈ సందర్భంగా వెల్దండ సీఐ విష్ణువర్దన్‌రెడ్డి, ఎస్‌ఐ శంషుద్దీన్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధులు, సీనియర్ అసిస్టెంట్ శ్రీను, ఆర్ భరత్ పాల్గొన్నారు.
మైనింగ్ పనులు నిలిపివేయాలి
బ్లాక్ గ్రానెట్ తవ్వకాలు చేపట్టకూడదని సిరసనగండ్ల గ్రామానికి చెందిన పలువురు రైతులు తహసీల్దార్ సునీతకు వినతి పత్రం ఇచ్చారు. గ్రామస్థులు, రైతులకు సమాచారం లేకుండా అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారని వారు తెలిపారు. తమ పొలాల్లో సాగు చేసిన పంటలు మైనింగ్‌తో దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్థులు కృష్ణయ్య, రామచంద్రమ్మ, బుచ్చమ్మ, బక్కమ్మ, చెన్నయ్య, సురేశ్, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాసులు, అంబేడ్కర్ సంఘం నాయడు వెంకటయ్య, విజయ్ పాల్గొన్నారు.