Share News

ప్రజల గుండె చప్పుడే.. హామీలు

ABN , Publish Date - Sep 17 , 2025 | 10:58 PM

ప్రజా పాలనలో పాలమూరు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు.

ప్రజల గుండె చప్పుడే.. హామీలు
జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు చిత్రంలో(ఎడమ నుంచి) ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జీఎంఆర్‌, అనిరుధ్‌రెడ్డి, కలెక్టర్‌ విజయేందిర బోయి, ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్‌ శివేంద్ర పతాప్‌

ఎన్నికల్లో గెలవాలని అలవికాని హామీలు ఇవ్వలేదు

ఈ నెల 21 నుంచి బతుకమ్మ సంబురాలు

ప్రజాపాలన దినోత్సవంలో ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రజా పాలనలో పాలమూరు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ఎన్నికల్లో ఏదో విధంగా గెలువాలని హామీలు ఇవ్వలేదని, ప్రజల గుండె చప్పుళ్లకు స్పందించి రూపొందించినవే ఈ హామీలని స్పష్టం చేశారు. బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, జి మధుసూదన్‌రెడ్డి, జనుంపల్లి అనురుద్‌రెడ్డి, కలెక్టర్‌ విజయేందిరబోయి, ఎస్పీ జానకిలతో కలిసి మంత్రి జాతీయజెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం తెలంగాణ నిజాం పాలన నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థకు పరివర్తన చెందిన రోజుగా సెప్టెంబరు 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోందన్నారు.

భూభారతితో పారదర్శకత

ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్‌ను తెచ్చామని మంత్రి చెప్పారు. ఈ పోర్టల్‌ ద్వారా రైతులు పారదర్శకంగా, వేగంగా తమ భూ ముల వివరాలను తెలుసుకోవడంతో పాటు భూమి రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్లు, ఆస్తుల బదిలీలు చేయించుకుంటున్నారన్నారు. జిల్లాలో 10,909 అర్జీలను స్వీకరించి 1,823 పరిష్కరించడం జరిగిందన్నారు.

వ్యవసాయానికి ప్రాధాన్యం

వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. యాసంగిలో రైతు భరోసా కింద 1,88,836 మంది రైతులకు రూ.161 కోట్లు, వానాకాలం సీజన్‌కు 2,12,929 మంది రైతులకు రూ.243 కోట్లు సాయం అందించామన్నారు. జిల్లాలో 2024కు సంబంధించి 76,385 మంది రైతుల రూ.597 కోట్ల పంటల రుణాలను మాఫీ చేయడం జరిగిందన్నారు. 21,318 కొత్త రేషన్‌కార్డులను మంజూరు చేయడంతోపాటు 53,925 కార్డుల్లో 91,040 కుటుంబ సభ్యులను చేర్చామన్నారు.

పాలమూరుకు విద్యాసంస్థలు

నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి చెప్పారు. బాలానగర్‌ మండలం పెద్దాయపల్లి, సీసీకుంట మం డలం ధమగ్నాపూర్‌లో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. మహబూబ్‌నగర్‌ నియోజకవర్గానికి కూడా ఇంటిగ్రేడెట్‌ పాఠశాల మంజూరైందన్నారు. బాలానగర్‌ మండలం పెద్దాయపల్లికి నవోదయ విద్యాలయం మంజూరు కాగా, జిల్లాకు ట్రిపుల్‌ ఐటీ వచ్చిందన్నారు. పాలమూరు యూనివర్సిటీకి ఇంజనీరింగ్‌, లాకాలేజీలు వచ్చాయన్నారు. ప్రతీ లోక్‌సభ నియోజకవర్గానికి స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నామని మంత్రి తెలిపారు.

నెరవేరుతున్న సొంతింటి కళ

ప్రజల సొంతింటి కళ నేరవేర్చే దిశగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుందన్నారు. మొదటి విడతలో ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేశామన్నారు. జిల్లాలో 11,037 ఇళ్లు రూ.552 కోట్ల అంచనాతో మంజూరు చేసినట్లు వివరించారు. 6,878 ఇళ్ల పనులు మొదలయ్యాయని, వాటిలో 4,069 ఇళ్లు బేస్‌మెంట్‌ లెవల్‌, 1,035 ఇళ్లు గోడలు, 342 ఇళ్లు స్లాబ్‌ వరకు పనులు చేపట్టారన్నారు. 4,103 ఇళ్లకు దాదాపు రూ.43 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.

టూరిజంను అభివృద్ధి చేస్తాం

ఎకో టూరిజంలో భాగంగా పిల్లలమర్రి పరిసరాల్లో ఉన్న జూపార్కును అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా మార్చేందుకు రూ.5 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈనెల 21 నుంచి గ్రామ గ్రామాన బతుకమ్మ సంబురాలు పెద్దఎత్తున నిర్వహించుకోవాలని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు శివేంద్రప్రతాప్‌, ఏనుగు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బెక్కరి అనిత, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2025 | 10:58 PM