సాగు భూములకు పట్టాలు ఇవ్వాలి
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:27 PM
పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.
- సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం
మరికల్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి) : పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా, మరికల్ మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలోని కంసాన్‌పల్లి, లింగంపల్లి, కొల్లంపల్లి, మరికల్, పిడింపల్లి తదితర గ్రామాల్లో 1,855 ఎకరాల ప్రభుత్వ భూమిని పేద రైతులు చాలా ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారన్నారు. కానీ ప్రభుత్వం వారికి ఇప్పటివరకు పట్టా పాస్‌బుక్కులు ఇవ్వలేదని, రైతు భరోసా, రైతు బీమా తదితర పథకాలను వర్తింప చేయడం లేదని విమర్శించారు. కౌలుదారీ, భూసంస్కరణలు, ఉపాధి హామీ తదితర చట్టాలను సీపీఎం పోరాటాల ద్వారానే సాధించామన్నారు. దేశ సంపదను బడాబాబులకు ధారాదత్తం చేస్తూ, పేదలు, రైతులు, సామాన్యులకు తీరని ద్రోహం తలపెడుతున్న భారతదేశ పాలకవర్గంపై పోరాటమే శరణ్యమన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ రాష్ట్రంలో .కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్షులైన వారందరికీ రేషన్‌కార్డులు, ఇదిరమ్మ ఇళ్లు, సాగు భూములకు పట్టాలు, పెన్షన్లు అందేలా పార్టీ ఆధ్వర్యంలో పోరాడుతున్నట్లు తెలిపారు. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాల నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గోపాల్, వెంకట్రాములు,, నాగయ్య, సాగర్, వెంకట్రామారెడ్డి, బాల్‌రామ్, అంజిలయ్య,గౌడ్, బాలప్ప పాల్గొన్నారు.