Share News

పట్నంలో పంచాయతీ

ABN , Publish Date - Dec 08 , 2025 | 11:09 PM

పంచాయతీ ఎన్నికలు కీలకదశకు చేరుకుంటున్నాయి. మొదటి దశ పోలింగ్‌ ఎల్లుండి గురువారం జ రుగనుంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో అభ్యర్థు లు, వారికి మద్దతు ఇస్తున్న పార్టీల నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

పట్నంలో పంచాయతీ

వలస ఓటర్లను రప్పించేందుకు నగరాల్లో కసరత్తు

ప్రత్యేక వాహనాల ఏర్పాటు.. దారి ఖర్చు ఇచ్చి ఓట్ల అభ్యర్థన

ఆన్‌లైన్‌ ద్వారా యువకులకు దావత్‌ కోసం డబ్బులు

ఆయా పట్టణాల్లో ప్రత్యేక సమావేశాల నిర్వహణకు ప్రణాళిక

హైదరాబాద్‌, పూణె, ముంబైకి అభ్యర్థుల అనుచరుల పయనం

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పంచాయతీ ఎన్నికలు కీలకదశకు చేరుకుంటున్నాయి. మొదటి దశ పోలింగ్‌ ఎల్లుండి గురువారం జ రుగనుంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో అభ్యర్థు లు, వారికి మద్దతు ఇస్తున్న పార్టీల నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎలాగైనా పంచాయతీ స్థానాన్ని గెలుచుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. గ్రామాల్లో అభివృద్ధికి ఏం చేస్తామో కొందరు బాండ్‌ పేపర్లపై రాసి ఇస్తుండగా.. మరికొందరు తీర్మానాలు చేస్తున్నారు. ప్రధానంగా దేవాలయాల అభివృద్ధి, సమూహిక అవసరాలకు ఉప యోగపడే వాటికి ఆర్థిక సాయం చేస్తామని చెబుతున్నారు. ఇవన్నీ గ్రామాల్లో ఉండేవారు అనుభవిస్తారు కాబట్టి వారు ఆ హామీల ఆధారంగా ఓట్లు వేస్తారు. మరి పట్టణాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉండేవారు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో అధిక సంఖ్యలో ఉంటారు. దాంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒక్కో ఊరిలో ఇలాంటి వారు కనీసం 100 నుంచి గ్రామ జనాభాను బట్టి 500 మంది ఓటర్ల వరకు ఉంటారని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఓట్లు చాలా కీలకంగా మారనున్నాయి. అందుకే వారి ఓట్లు గంపగుత్తగా ఎవరికి పడితే వారు విజయం సాధించవచ్చనే భావన కూడా అభ్యర్థుల్లో ఉంది. ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లా ఓటర్లు హైదరాబాద్‌, ముంబై, పూణె, బెంగళూరు వంటి పట్టణాల్లో స్థిరపడ్డారు. ఇప్పుడు వారి వద్దకు నేరుగా అభ్యర్థులు పరుగులు పెట్టడం లేదా వారి అనుచరులను పంపించడం చేస్తున్నారు. డబ్బు రవాణాపై మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఉండటంతో అంతా ఆన్‌లైన్‌ ద్వారా పేమెంట్లు చేస్తున్నారు. ఓవైపు గ్రామీణ ప్రాంతాల్లో దావత్‌లు జరుగుతుండగా.. పట్టణ ప్రాంతాల్లో వారికి దావత్‌లకు పేమెంట్లు ఫోన్‌పే, గూగుల్‌ పే ద్వారా చేసేస్తున్నారు.

రానుపోను ఖర్చులు.. వాహనాలు..

మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలంలో అభ్యర్థులు హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల వద్దకు తమ మద్దతుదారులు, కుటుంబ సభ్యులను పంపించి రానుపోను ఖర్చులు ఇచ్చి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఒకేచోట ఎక్కువ మంది ఉంటే నేరుగా వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ ఓటర్లు ఎక్కువగా హైదరాబాద్‌లో ఉండటంతో అలాంటి ఓటర్ల వివరాలు తీసుకుని పట్నంబాట పట్టారు. మండల కేంద్రానికి సంబంధించిన ప్రధాన అభ్యర్థులు హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాలులో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మరో అభ్యర్థి ఒక హోటల్‌లో సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. వాహనాలు పెట్టడంతోపాటు ఖర్చులకు రూ.3,000 నుంచి రూ. 5,000 వరకు ఇస్తామని చెబుతున్నారు.

కోయిల్‌కొండ మండలంలో 75 గిరిజన తండాలు ఉన్నాయి. ఎక్కువగా పూణె, ముంబైలో పనికోసం వెళ్లారు. వారిని తెచ్చేందుకు ప్రైవేటు బస్సులను బుక్‌ చేశారు. ఒక్కొక్కరికి రూ. 2,000 ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు. ఇక్కడి నుంచి పనికి తీసుకెళ్లిన గుంపుమేస్ర్తీల ద్వారా ఓటర్లను తేవడానికి ప్రయత్నిస్తున్నారు.

జడ్చర్ల మండలంలోని అభ్యర్థులు వలస ఓటర్లకు దారి ఖర్చులతోపాటు తాయిళాలు ఇచ్చేందుకు ఒప్పందం కుదర్చుకుంటున్నారు.

భూత్పూరు మండలంలో 19 పంచాయతీల్లో 18 జీపీల్లో హోరాహోరీగా పోటీ జరుగుతోంది. పనికోసం, ఉద్యోగం కోసం, చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి ఫోన్‌ పే ద్వారా దారి ఖర్చులతోపాటు కొంత అదనంగా డబ్బులు వేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి రావడానికి ఒక్కో ఓటరుకు రూ.500 నుంచి రూ.1,500 వరకు పంపుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి రావడానికి రూ.2,500 నుంచి రూ.4,000 వరకు ఇస్తున్నారు.

మల్దకల్‌ మండలంలో అభ్యర్థులకు ఇటీవల జాతర జరగడం కలిసొచ్చింది. అక్కడికి వచ్చిన వారిని కలుసుకుని ఓట్లను అభ్యర్థించారు. జాతరకు రానివారికి ఫోన్లు చేస్తున్నారు.

కొల్లాపూర్‌ నియోజకవర్గంలో ఓటుకు నోటుతోపాటు వాహన సదుపాయం కల్పిస్తున్నారు. కులాలవారీగా పెద్దలను సంప్రదిస్తూ వలస ఓటర్ల దగ్గరకు పంపుతున్నారు.

ఊర్కొండ మండలంలో వలస ఓటర్లకు రూ.2,000 నుంచి రూ.3,000 వరకు ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేస్తున్నారు. హన్వాడ మండలంలో పూణె, ముంబై, హైదరాబాద్‌కు తమ అనుచరులను పంపించి.. అడ్వాన్సుగా ఓటర్లకు డబ్బులు ఇచ్చి వస్తున్నారు. ఎల్లంబాయ్‌, నాగంబాయ్‌, అయోధ్యనగర్‌, షేక్‌పల్లి తండా అభ్యర్థులు ఆయా ప్రాంతాల్లో ఓటర్ల కోసం తాయిళాలు ఇస్తున్నారు.

అచ్చంపేట రెవెన్యూ డివిజన్‌ పరిధిలో హైదరాబాద్‌, గుంటూరు, మిర్యాలగూడలో ఉన్న ఓటర్ల వద్దకు అనుచరులను పంపి, ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేస్తామని డబ్బులు ఇచ్చి వస్తున్నారు.

మాగనూర్‌ మండలంలో వలస ఓటర్లు వస్తే ఉండటానికి ప్రత్యేక రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గ్రామం నుంచి ఇద్దరిని వలస ఓటర్ల ప్రాంతాలకు పంపి తీసుకువస్తున్నారు.

మరికల్‌ మండలంలో ఆదివారం ముంబై, పూణెకు అభ్యర్థుల అనుచరులు బయల్దేరగా.. హైదరాబాద్‌కు సోమవారం ఉదయం బయల్దేరారు. 14వ తేదీ వరకు అక్కడే తిరిగి ఓటర్లను పోలింగ్‌కు తేనున్నారు.

కోస్గి మండలం ముసిరిప్ప, బీసీ తండా, ముంగిమల్ల, మీర్జాపూర్‌, సబ్జాఖాన్‌పేట్‌, తోగాపూర్‌, మద్దూరు మండలం నాగిరెడ్డిపల్లి, దంగానపూర్‌ గ్రామాల వలస ఓటర్లను రప్పించడానికి తరలి వెళ్లారు.

Updated Date - Dec 08 , 2025 | 11:09 PM