Share News

‘పాలమూరు - రంగారెడ్డి’కి జాతీయ హోదా కల్పించాలి

ABN , Publish Date - Jun 20 , 2025 | 11:43 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన హామీల్లో భాగంగా పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని అఖిల భారత కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్‌ డిమాండ్‌ చేశారు.

‘పాలమూరు - రంగారెడ్డి’కి  జాతీయ హోదా కల్పించాలి
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మ్యాప్‌ను పరిశీలిస్తున్న రైతు సంఘం అఖిల భారత కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్‌

- ప్రాధాన్య క్రమంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి

- స్పందించకపోతే ఉద్యమాల ద్వారా కేంద్రం మెడలు వంచుతాం

- రైతు సంఘం అఖిల భారత కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్‌

కొల్లాపూర్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి) : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన హామీల్లో భాగంగా పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని అఖిల భారత కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్‌ డిమాండ్‌ చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా, కొల్లాపూర్‌ మండల పరిధిలోని పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన సర్జికల్‌, టన్నల్‌ అప్రోచ్‌ కెనాల్‌ పంప్‌ హౌస్‌ జీరో పాయింట్‌ ప్రాంతాలను రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యం క్రమంలో పూర్తి చేయాలని కోరారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులను మొదలు పెట్టి 15 సంవత్సరాలు గడిచినా, ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ సైతం దక్షిణ తెలంగాణలో ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టులు ఏవి చేపడుతారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకపోతే త్వరలో ఉద్యమ కార్యాచరణ మొదలు పెడతామని హెచ్చరించారు. రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్‌ మాట్లాడుతూ 2023, సెప్టెంబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసన సభ ఎన్నికలకు ముందు ఒక మోటార్‌ ద్వారా నీటిని విడుదల చేసి, ఎన్నికలు ముగియగానే నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త హరి బండి ప్రసాద్‌ రావు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌ రావు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రారెడ్డి, జంగారెడ్డి, శోభన్‌, మధుసూదన్‌, బాల్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గం పర్వతాలు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసులు, కందికొండ గీత, దేశ్యానాయక్‌, చింత ఆంజనేయులు, పీ ఆంజనేయులు, సీపీఎం కొల్లాపూర్‌ మండల కార్యదర్శి శివ వర్మ, నాయకులు శ్రీనివాసులు, నరసింహ, తారాసింగ్‌, దేవేందర్‌, బాల పీరు, కిరణ్‌, సలీం, మధు, శివశంకర్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2025 | 11:43 PM