ఉమ్మడి జిల్లా లీగ్ టోర్నీలో పాలమూరు విజయం
ABN , Publish Date - May 23 , 2025 | 11:30 PM
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా, అండర్-23 లీగ్ టోర్నీలో మహబూబ్‌నగర్ జట్టు గద్వాల జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

- 5 వికెట్లు తీసిన ముఖీద్
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, మే 23 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా, అండర్-23 లీగ్ టోర్నీలో మహబూబ్‌నగర్ జట్టు గద్వాల జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జిల్లా కేంద్రంలోని సమర్థ పాఠశాల మైదానంలో ఈ టోర్నీ కొనసాగుతోంది. అందులో భాగంగా శుక్రవారం నిర్వహించిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన గద్వాల జట్టు మొదట బ్యాటింగ్ చేసి, 25.2 ఓవర్లలో 104 పరుగులకు అలౌట్ అయ్యింది. గద్వాల జట్టులో రాహుల్ యాదవ్ 62 బంతుల్లో ఒక సిక్స్, 7 ఫోర్లతో అర్ధసెంచరీ(53) సాధించాడు. మణిగణేష్ 11, జానీ 10 పరుగులు చేశారు. మహబూబ్‌నగర్ బౌలర్లలో ముఖీద్ 7 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి రాణించాడు. కే శ్రీకాంత్ 4 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మహబూబ్‌నగర్ జట్టు 21 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసి విజయం సాధించింది. శ్రీకాంత్ 17, అభిలాష్‌గౌడ్ 18, డేవిడ్ క్రిపాల్ 44, షాదాబ్ అహ్మద్ 12 పరుగులు చేసి జట్టు చేసి జట్టు విజయానికి కృషి చేశారు. వరుసగా రెండు మ్యాచ్‌లలో మహబూబ్‌నగర్ జట్టు గెలుపొందింది.
క్రీడల్లో గెలుపు, ఓటములు సహజం
క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని మహబూబ్‌నగర్ అర్బన్ అథారిటీ చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్ అన్నారు. మహబూబ్‌నగర్, గద్వాల జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టోర్నీలో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటి రంజీకి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో క్రికెట్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు సురేశ్‌కుమార్, అశోక్, సీనియర్ క్రీడాకారుడు శ్రీను పాల్గొన్నారు.