Share News

వేతనాలు అందక ఓపీఎస్‌ల వెతలు

ABN , Publish Date - Jul 17 , 2025 | 11:19 PM

దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించడం లేదనే విధంగా మారింది ఓపీఎస్‌ కార్యదర్శుల పరిస్థితి.

వేతనాలు అందక ఓపీఎస్‌ల వెతలు
సమస్యలు పరిష్కారించాలని మండల పరిధిలో వినతి పత్రం ఇస్తున్న ఓపీఎస్‌లు (ఫైల్‌)

- ప్రభుత్వం విడుదల చేసినా.. జమ చేయని ట్రెజరీ అధికారులు

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించడం లేదనే విధంగా మారింది ఓపీఎస్‌ కార్యదర్శుల పరిస్థితి. 2018లో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలో ఖాళీలుగా ఉన్న గ్రామాలకు ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో నెలకు రూ.18 వేల వేతనంతో కార్యదర్శులను నియమించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారికి సకాలంలో వేతనాలు అందిన దాఖలాలు లేవు. కాగా జిల్లాలోని 16 మండలాల్లో 30 మంది ఓపీఎస్‌ కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. వారికి ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల వేతనాలు రూ.16,40,790 విడుదల చేసింది. కానీ ట్రెజరీ అధికారులు సాంకేతిక కారణాలు చూపుతూ వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే జీతాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని పలువురు పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు.

రెగ్యూలర్‌ కార్యదర్శులతో సమానంగా పనిభారం

ఓపీఎస్‌ కార్యదర్శులు వారికి కేటాయించిన గ్రామాల్లో రెగ్యులర్‌ కార్యదర్శులతో సమానంగా పని చేస్తున్నారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, హరితహారం, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎంపిక, ఎంపికైన లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు చేపడుతున్నారు. అయినప్పటికీ రెగ్యులర్‌ కార్యదర్శులకు, వీరికి వేతనాల్లో భారీ వ్యత్యాసం ఉంది.

రెగ్యులరైజ్‌ చేస్తారని ఆశ..

కాంట్రాక్టు పద్దతిన నియమించుకున్న ప్రభుత్వం తమను రెగ్యులర్‌ చేస్తుందనే ఆశాభావంతో ఓపీఎస్‌లు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా విధులు నిర్వహిస్తున్నారు. గత నెలలో డీఎస్‌ఆర్‌ యాప్‌కు వ్యతిరేఖంగా రెగ్యులర్‌ కార్యదర్శులు వ్యతిరేకించినా వీరు ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ప్రభుత్వం వీరికి ఇచ్చే రూ.18 వేల వేతనంలో కోతలు విధించడంతో వారి చేతికి నెలకు రూ.14,850 అందుతున్నాయి. వారి వేతనంలో ఏజెన్సీకి రూ.450, జీఎస్టీకి రూ.2700, ప్రోబీషనరి చార్జీల పేరుతో రూ.150 వసూలు చేస్తున్నారు.

ట్రెజరీలో జమ చేశాం... డీపీవో పార్థసారథి

ఓపీఎస్‌ల మూడు నెలల వేతనాలు ట్రెజరీలో జమచేశాం. ట్రెజరీ వారు ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ కోసం నిలిపివేసింది. తమ శాఖ ఉన్నతాధికారులు వేతనాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వారి ఆదేశానుసారమే ఓపీఎస్‌ల వేతనాలు చెల్లించేందుకు కృషి చేస్తాం.

Updated Date - Jul 17 , 2025 | 11:19 PM