Share News

ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపివేయాలి

ABN , Publish Date - May 06 , 2025 | 11:36 PM

ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపివేసి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ డిమాండ్‌ చేశారు.

ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపివేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

వనపర్తి టౌన్‌, మే 6 (ఆంధ్రజ్యోతి) : ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపివేసి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ డిమాండ్‌ చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించడం సరైనది కాదన్నారు. కులగణనను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ముస్లింలలో ఫకీర్లు, పింజరులు, దూదేకులు తదితర వెనుకబడ్డ జాతులను మతం పేరుతో బీసీల్లో చేర్చొద్దనడం రాజ్యాంగ వ్యతిరేక చర్య అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అన్ని గ్యారెంటీలను నూటికి నూరుశాతం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు రుణమాఫీ అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కేరళ ప్రభుత్వం తరహలో రాష్ట్రంలోను పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్‌ దుకాణాల్లో 14 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని కోరారు. జాతీయ, రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈనెల 20న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెకు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్ధతు తెలుపుతోందన్నారు. అంతకుముందు కారల్‌ మార్క్స్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ జబ్బార్‌, జీఎస్‌ గోపి, బాల్‌రెడ్డి, మండ్ల రాజు, లక్ష్మి, ఉమా, మేకల ఆంజనేయులు, ఆర్‌ఎన్‌ రమేశ్‌, బాల్య నాయక్‌, పరమేశ్వరాచారి పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 11:36 PM