కురుమూర్తి రాయుడికి కోటి దండాలు
ABN , Publish Date - Oct 21 , 2025 | 10:53 PM
మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కురు మూర్తి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
- నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
- 26న అలంకారోత్సవం, 28న ఉద్దాలోత్సవం
- ఏర్పాట్లపై నేడు సమీక్షా సమావేశం
చిన్నచింతకుంట, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కురు మూర్తి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు 45 రోజుల పాటు జాతర కొనసాగనున్నది. ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలిరానున్నారు. ఉత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మ వార్లు మయూర, హంస, శేష, అశ్వ, హనుమత్, గరు డ, గజ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమి వ్వనున్నారు. స్వామి, అమ్మవార్లకు భక్తులు దాసంగా లను సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఉత్సవా లు, జాతర ఏర్పాట్లపై బుధవారం దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మదుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. దీనికి కలెక్టర్ విజయేందిరబోయి లతో పాటు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
ఉత్సవాలు కొనసాగేది ఇలా..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా 22న ఉదయం ఆవాహిత దేవతాపూజలు,ఽ ద్వజారోహణం, దేవతాహ్వానం, భేరిపూజ, అష్టోత్తర శతకలశాభిషేకం, కల్యాణోత్సవం, మయూర, హంస వాహన సేవలు నిర్వహిస్తారు. 23న నిత్య విశేష పూజలతో పాటు హంసవాహనసేవ, 24న శేష వాహనసేవ. 25న గజవాహనసేవ ఉంటాయి. 26న ఆత్మకూర్ ఎస్‌బీఐ నుంచి క్షేత్రం వరకు ఆభరణాల ఊరేగింపు ఉంటుంది. అదే రోజు రాత్రి స్వామి వారికి అలంకారోత్సవం నిర్వహిస్తారు. 27న హనుమత్‌సేవ, 28న ఉద్దాలోత్సవం, రాత్రికి గరుడ వాహన సేవ ఉంటాయి. 29న పుష్పయాగం, మంగళ నీరాజనం, 30న మంగళ నీరాజనంతో కార్యక్రమం పరిసమాప్తి కానున్నది.
పకడ్బందీ ఏర్పాట్లు
బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా తరలి రానున్న భక్తుల కోసం అవసరమైన ఆలయ పాలకవర్గం, అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. అడుగడుగునా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. పోలీ సు ఔట్‌పోస్టును ఏర్పాటు చేస్తున్నారు. జాతరమైదానంలో 3 ఆర్టీసీ బస్సు స్టాప్‌లను ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా గుట్టమీద క్యూలైన్లు, బారి కేడ్లను సిద్ధం చేశారు. కోనేరు వద్ద గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచనున్నారు. జాతర ప్రాంగణంతో పాటు, సమీప ప్రాంతాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయనున్నారు. అందుకోసం ఎక్సైజ్ పోలీసులు ప్రధాన కూడళ్ళ వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేందుకు పారిశుధ్య సిబ్బందిని సిద్ధం చేశారు.
అప్పుల బాధ తాళలేక...
కురుమూర్తి క్షేత్ర విశిష్ఠతపై ఆసక్తికర కథనం ఉంది. కుబేరుడి అప్పుల బాధ భరించలేక స్వామి వారు లక్ష్మీదేవితో కలిసి ఉత్తర ముఖంగా కురుమూర్తి వైపు వస్తున్నారు. కురుమూర్తి కొండల నుంచి చల్లటి, సువాసనా భరిత గాలులు రావడాన్ని గమనించిన లక్ష్మీదేవి కాసేపు విశ్రమిద్దామని స్వామిని కోరింది. అందుకు స్వామి వారు సమ్మతించారు. దేవరగట్టులోని కాంచనగుహలో స్వామి, అక్కడికి సమీపంలోని కొండపై అమ్మవారు కొలువుదీరారు. అప్పటి నుంచి భక్తులు స్వామి అమ్మవార్లకు పూజలు చేస్తున్నారు. ఆనాటి ముక్కెర వంశ రాజులు ఆలయ అభివృద్ధికి సహాయ సహకారలు అందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ క్షేత్రం తిరుమల తిరుపతికి, కురుమూర్తి క్షేత్రానికి పలు పోలికలు కనిపిస్తాయి. అక్కడ ఉన్నట్లుగానే ఇక్కడా ఏడు కొండలున్నాయి. మోకాళ్ల పర్వతం కూడా ఉంది. స్వామి వారి రాజగోపురం సమీపంలో మెట్ల దారిలో స్వామి వారి పాదాలు భక్తులకు దర్శనమిస్తాయి. గుట్టపైన లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు. సమీపంలోనే చెన్నకేశవస్వామి వారి ఆలయం ఉంది.