అమ్మో చిరుత
ABN , Publish Date - Nov 12 , 2025 | 11:09 PM
నారాయణపేట జిల్లాలో గుట్టలు, వ్యవసాయ పొలాలకు సమీపంలో చిరుత పులులు సంచరిస్తుండటంతో ప్రజలు, రైతులు భయపడుతున్నారు. పొలాలకు వెళ్లే రైతులు, పశువులు, బర్రెలు, మేకలను కాసేందుకు అడవికి వెళ్లే కాపరులు జంకుతున్నారు.
నారాయణపేట జిల్లాలో భయపెడుతున్న చిరుత పులుల సంచారం
ఇదివరకే ఎక్లా్‌సపూర్ ఎకో పార్కు దగ్గర సీసీ కెమెరాల్లో కనిపించిన చిరుత
తాజాగా మద్దూర్ మండలం పెద్రిపహాడ్ వద్ద కనిపించిన రెండు మృగాలు
ఆందోళనలో రైతులు, కాపర్లు
గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 54 పశువులు, గొర్రెలపై దాడి
నారాయణపేట, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లాలో గుట్టలు, వ్యవసాయ పొలాలకు సమీపంలో చిరుత పులులు సంచరిస్తుండటంతో ప్రజలు, రైతులు భయపడుతున్నారు. పొలాలకు వెళ్లే రైతులు, పశువులు, బర్రెలు, మేకలను కాసేందుకు అడవికి వెళ్లే కాపరులు జంకుతున్నారు. తాజాగా సోమవారం మద్దూర్ మండలం పెదరిపాడ్ తండా గుట్ట ప్రాంతాల్లో పెద్ద చిరుతతో పాటు చిన్న పిల్ల కనిపించడంతో తండా వాసులు హడలెత్తిపోయారు. జిల్లాలో 12 చిరుత పులులు, ఐదు చిన్న పిల్లలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
2.33 లక్షల హెక్టార్లలో అడవులు
జిల్లా వ్యాప్తంగా 2.33 లక్షల హెక్టార్లలో అడవులు ఉన్నాయి. మినా్‌సపూర్, కోటకొండ రిజర్వు ఫారెస్టు బ్లాకులు ఉన్నాయి. జంతువుల కదలికలను గుర్తించేందుకు అటవీ శాఖ అధికారులు 19 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇదివరకే ఎక్లా్‌సపూర్ ఎకో పార్కు దగ్గర చిరుత సంచరించిన్నట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఎక్లా్‌సపూర్, కోటకొండ, మద్దూర్, లక్ష్మీపూర్, కొల్లంపల్లి అడవుల్లోనూ చిరుత సంచరిస్తోందని గామస్థులు చెబుతున్నారు. దామరగిద్ద మండలం బాపన్‌పల్లి, ధన్వాడ మండలం కిష్టాపూర్, కొండాపూర్, మందిపల్లి తండా, రాంకిష్టయ్యపల్లి, మద్దూర్, పెదిరెపాడ్ తండా, గుండుమాల్, కొత్తపల్లి మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తూ వ్యవసాయ పొలాల వద్ద కట్టేసిన పశువులపైనా, మేతకు తీసుకెళ్లిన గొర్రెలపైనా దాడి చేసి చంపేస్తుందని రైతులు అంటున్నారు.
17 చిరుతలు
జిల్లాలోని అడవుల్లో 12 చిరుత పులులు, ఐదు చిన్న పిల్లలు మొత్తం 17 సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో ధన్వాడ మండలం రాకోండ శివారులో చిరుతను అటవీ అధికారులు బోను ఏర్పాటు చేసి పట్టుకున్నారు.
ఏడాదిలో..
జిల్లాలో 2024 నుంచి ఇప్పటి వరకు చిరుత పులులు 54 పశువులు, బర్రెలు, గొర్రెలను చంపి తిన్నాయని అటవీశాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. దాంతో బాధితులు 16.24 లక్షలు నష్టపోయారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, రూ.3 లక్షల వరకు బాధిత రైతులకు నష్టపరిహారం చెక్కులను అందించారు.
రైతులు జాగ్రత్తగా ఉండాలి
జిల్లాలోని మద్దూర్, గుండుమాల్, కొత్తపల్లి, కోటకొండ, ఎక్లా్‌సపూర్, కర్ణాటక సరిహద్దు తదితర అటవి ప్రాంతాల్లో 12 చిరుత పులులు, ఐదు చిన్నవి ఉన్నాయి. రైతులు పశువులను పొలాల వద్ద కాకుండా ఇళ్ల వద్ద కట్టేసుకోవాలి. రాత్రి వేళ ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లొద్దు. పులులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలి. బోన్లు ఏర్పాటు చేసి పట్టుకుంటాం. ఇప్పటికే జిల్లాలో పలు చోట్ల బోన్లు ఏర్పాటు చేశాం.
- కమాలొద్దీన్, ఫారెస్ట్ అసిస్టెంట్ రేంజ్ ఆఫీసర్, నారాయణపేట