నామినేషన్ వేయకుండా అడ్డగింత
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:37 PM
జోగుళాంబ గద్వాల జిల్లాలో మొదటి విడత నామినేషన్ల సందర్భంగా ఓ వ్యక్తిని నామినేషన్ వేయనీయకుండా అడ్డుకున్న సంఘటనపై మంగళవారం అధికారులు విచారణ చేపట్టారు.
- యర్సన్‌దొడ్డిలో గతనెల 29న ఘటన
- కలెక్టర్ ఆదేశం మేరకు అధికారుల విచారణ
గద్వాల, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : జోగుళాంబ గద్వాల జిల్లాలో మొదటి విడత నామినేషన్ల సందర్భంగా ఓ వ్యక్తిని నామినేషన్ వేయనీయకుండా అడ్డుకున్న సంఘటనపై మంగళవారం అధికారులు విచారణ చేపట్టారు. కేటీదొడ్డి మండలంలోని చింతలకుంట గ్రామానికి చెందిన కుశ అనే వ్యక్తి నవంబరు 29న నామినేషన్ వేసేందుకు యర్సన్‌దొడ్డిలోని నామినేషన్ కేంద్రానికి వెళ్లాడు. అయితే అప్పటికే సర్పంచు పదవికి ఓ వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకోవా లని గ్రామస్థులు ప్రతిపాదించడంతో ఆయన నామినేషన్ వేశాడు. కానీ కుశ కూడా నామినేషన్ వేయడానికి వెళ్లడంతో కొందరు ఆయనను అడ్డుకున్నారు. ఈ విషయంపై బాధితుడు ఈనెల 1వ తేదీన కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తనను అడ్డుకొని ఒక గదిలో బంధించారని, నామినేషన్ పత్రాలను చించివేశాడని అతడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాకుండా సర్పంచు పదవిని వేలం వేసి, ఏకగ్రీవం చేశాడని లిఖిత పూర్వకంగా పేర్కొన్నారు. ఇదే విషయంపై సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు మోహన్‌రావు కూడా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కలెక్టర్ బీ ఎంసంతోష్ ఆదేశం మేరకు తహసీల్దార్ హరికృష్ణ, ఎంపీ డీవో రమణారావు, ఎస్‌ఐ శ్రీ నివాసులు మంగళవారం గ్రామానికి వెళ్లి బాధితుడు కుశతో మాట్లాడి, లిఖిత పూర్వకంగా వాంగ్మూలం తీసుకున్నారు. నామినేషన్ కేంద్రం వద్ద సంఘటన జరగడంతో, రిటర్నింగ్ అధికారి వివరణ కూడా తీసుకున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ హరికృష్ణను ‘ఆంధ్ర జ్యోతి’ వివరణ కోరగా, కలెక్టర్ ఆదేశం మేరకు విచారణ నిర్వహిం చినట్లు తెలిపారు. పూర్తి వివరాలతో కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తామని చెప్పా రు.