Share News

తొలగుతున్న అడ్డంకులు

ABN , Publish Date - Nov 07 , 2025 | 11:08 PM

మహబూబ్‌నగర్‌ నడిబొడ్డున చేపట్టిన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగుతున్నాయి. కీలకమైన ఐదో బ్లాకు ఇన్నాళ్లు నిర్మాణానికి నోచుకోలేదు. అందులో ఈవీఎం గోదాము ఉండటమే కారణం.

తొలగుతున్న అడ్డంకులు
జనరల్‌ ఆస్పత్రికి కేటాయించిన స్థలంలో ఉన్న ఈవీఎం గోదాం


సూపర్‌ స్పెషాలిటీ ఆవరణలోని ఓ బ్లాక్‌లో ఈవీఎం గోదాం

దాంతో ప్లానింగ్‌ ప్రకారం బ్లాక్‌ నిర్మించలేని పరిస్థితి

కోర్టు సూచనతో త్వరలో ఈవీఎంల గోదాం తరలింపు

వినియోగదారుల కోర్టు భవనానికి ప్రత్యామ్నాయం పరిశీలన

ఆస్పత్రి అందుబాటులోకి వస్తే 1003 పడకలతో అందనున్న అత్యాధునిక సేవలు

మహబూబ్‌నగర్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మహబూబ్‌నగర్‌ నడిబొడ్డున చేపట్టిన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగుతున్నాయి. కీలకమైన ఐదో బ్లాకు ఇన్నాళ్లు నిర్మాణానికి నోచుకోలేదు. అందులో ఈవీఎం గోదాము ఉండటమే కారణం. దాన్ని మరో భవనంలోకి తరలించి, ఆ స్థానంలో బ్లాకు నిర్మించడానికి అధికార యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అది కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉండటం, సున్నితమైన అంశం కావడంతో సరైన డైరెక్షన్‌ లేకుండా ఏదైనా చేస్తే సమస్యలు ఎదురవుతాయనే ఉద్దేశంతో పద్ధతి ప్రకారం ముందుకెళ్లారు. తాజాగా కోర్టు ఈవీఎం గోదాము తరలించి, ఐదో బ్లాకు నిర్మించాలని సూచించడంతో మార్గం సుగమం కానుంది. కోర్టు ఇచ్చిన డైరెక్షన్‌ను ఎన్నికల సంఘానికి పంపించి అనుమతి తీసుకున్న తర్వాతనే తరలింపు చేపట్టే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రూ. 178.30 కోట్లతో పనులు..

గత ప్రభుత్వ హయాంలో మహబూబ్‌నగర్‌ బస్టాండ్‌కు సమీపంలోనే ఉన్న కలెక్టరేట్‌ భవనాన్ని ఇక్కడి నుంచి భూత్పూరు రోడ్డుకు తరలించారు. అక్కడ నూతన భవనాన్ని నిర్మించారు. ఈ క్రమంలో అత్యంత అందుబాటులో ఉన్న 16.04 ఎకరాల్లో సుమారు 8 ఎకరాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి భవానాన్ని నిర్మించాలని నిర్ణయించారు. రూ.178.30 కోట్లు కేటాయిస్తూ 1,003 పడకలతో నిర్మించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అత్యాధునిక వసతులతో..

మొత్తం స్థలం ఆసుపత్రి అవసరాలకు తీసుకోగా.. 8 ఎకరాల్లో ప్రస్తుత భవనాలు పోను మిగతా స్థలంలో పీజీ హాస్టల్‌ భవనాలు నిర్మించ తలపెట్టారు. కానీ ఐదో బ్లాకును విస్మరించి, మిగతా నాలుగు బ్లాకులతో ప్రారంభించే అవకాశం లేకపోవడం ఇన్నాళ్లు అడ్డంకిగా మారింది. మొత్తం 400 నుంచి 500 మంది కార్మికులు నిత్యం పనిచేస్తూ దాదాపు పూర్తిదశకు తెచ్చారు. భవన నిర్మాణం పకడ్బందీగా ఉండేందుకు క్వాలిటీ కంట్రోల్‌ విభాగాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సిమెంట్‌, స్టీల్‌ ఇతర సామగ్రి నాణ్యతను చూస్తున్నారు. భవిష్యత్‌ అవసరాలను తీర్చే విధంగా అత్యాధునిక వసతులను సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో కల్పించనున్నారు. సెంట్రల్‌ ఏసీ, సెంట్రల్‌ ఆక్సిజన్‌ సిస్టమ్‌, అత్యాధునిక అగ్నిప్రమాద నివారణ సదుపాయాలను కల్పించనున్నారు. బయో మెడికల్‌ వ్యర్థాల నిర్వహణకు కూడా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

ఉమ్మడి జిల్లాకు మేలు..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటివరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే ఆసుపత్రి లేదు. దాదాపు 200 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉండటం, రెండు నదులు, తాజాగా రెండు భారత్‌మాల రహదారుల పనులు జరుగుతుండటం, నిత్యం ట్రామా కేసులు అధికంగా వస్తుండటంతో కొంత వైద్య సేవలకు హైదరాబాద్‌పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. అన్ని జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసి.. ఆసుపత్రులను జీజీహెచ్‌లుగా అప్‌గ్రేడ్‌ చేసినప్పటికీ అక్కడి నుంచి ఎక్కువగా రెఫరల్స్‌ మహబూబ్‌నగర్‌ ఆసుపత్రికే వస్తున్నాయి. అక్కడ వసతులు లేకపోవడం ఒక కారణమైతే.. రిస్క్‌ను భరించలేకపోవడం మరోకారణంగా చెప్పవచ్చు. అన్ని వసతులతో ఏర్పాటు కాబోతున్న మహబూబ్‌నగర్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు అత్యంత ఉపకరంగా ఉంటుందని చెప్పవచ్చు.

విభాగాలు ఇలా..

ఆస్పత్రిని ఐదు బ్లాకులు, ఆరు ఆంతస్థులుగా నిర్మిస్తున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో అన్ని విభాగాలకు సంబంధించిన ఓపీడి గదులు, వెయిటింగ్‌హాల్‌, ఫార్మసీ, రిజిస్ట్రేషన్‌, స్టోర్స్‌, రక్తనమూనాల సేకరణ, రేడియాలజీ, సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ స్కాన్‌, ఎక్స్‌రే విభాగాలు ఉండనున్నాయి. మొదటి అంతస్తులో సూపర్‌ స్పెషాలిటీకి సంబంధించిన ఓపీడీ విభాగాలు, మెడికల్‌ ఎమర్జెన్సీ, ఐసీయూ, ట్రయాజ్‌ వార్డులు, ట్రామా సెంటర్‌లు, బ్లడ్‌ బ్యాంకు, సెంట్రల్‌ ట్యాబు, క్యాత్‌ల్యాబ్‌, క్యాత్‌ వార్డు, ఐసీయూ ఏర్పాటు చేయనున్నారు. రెండో అంతస్తులో జనరల్‌ మెడిసిన్‌ వార్డులు, డిపార్ట్‌మెంట్‌ గదులు, బర్న్స్‌ వార్డు, టీబీ, సీడీ వార్డులు, సైకియాట్రి, చర్మవ్యాధుల వార్డులు ఉండనున్నాయి. మూడో అంతస్తులో జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్‌, ఆప్తాల్మిక్‌ వార్డులు, డిపార్ట్‌మెంట్‌ గదులు ఉండేలా చూస్తున్నారు. నాల్గో అంతస్తులో ఆపరేషన్‌ థియేటర్లు, పోస్ట్‌ఆపరేటిక్‌, అనెస్టిషియా రికవరీ వార్డులు, సీఎ్‌సఎ్‌సడీ, ఎస్‌ఐసీయూ, ఐసీసీయూ ఉండనున్నాయి. అదేవిధంగా ఐదో అంతస్తులో హాస్పిటల్‌ స్టోర్స్‌, అడ్మినిస్ట్రేషన్‌, సెమినార్‌ హాల్‌, ఎంఆర్‌డి, లెక్చర్‌ గ్యాలరీ, అకాడమిక్‌ బ్లాకును ఏర్పాటు చేస్తున్నారు.

నాలుగు బ్లాకులు 85 శాతం పూర్తి

అలాగే సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉన్న వినియోగదారుల కోర్టు భవనానికి కూడా ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తున్నారు. గతంలో ఉన్న జిల్లా కార్యాలయాల భవనాల్లో ఏదో ఒక భవనాన్ని దీనికి కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈవీఎం గోదాం అడ్డంకి తొలగిపోవడంతో త్వరితగతిన ఏర్పాట్లు పూర్తిచేసి.. భవనాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే నిర్మించిన నాలుగు బ్లాకుల్లో దాదాపు 85 శాతం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఐదో బ్లాకు నిర్మాణ సమయంలోనే మిగతా పెండింగ్‌ పనులను పూర్తి చేయనున్నారు. టీజీఎంఎ్‌సఐడీసీ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. ఆసుపత్రి అందుబాటులోకి వస్తే ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడున్న ప్రభుత్వ జనరల్‌ ధావాఖానాపై భారం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Nov 07 , 2025 | 11:08 PM