మొదటి రోజు మందకొడిగా నామినేషన్లు
ABN , Publish Date - Dec 01 , 2025 | 12:06 AM
మండలంలో మొదటిరోజు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మందకొడిగా కొనసాగింది.
మల్దకల్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): మండలంలో మొదటిరోజు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మందకొడిగా కొనసాగింది. మండల పరిధిలోని 25 గ్రామ పంచాయ తీల పరిధిలో 25 సర్పంచ్ స్థానాలకు 242 వార్డు సభ్యుల స్థానాల ఎన్నికకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా అధికారులు ఆదివారం నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం చేపట్టారు. కాగా మొదటిరోజు మొత్తం 25 సర్పంచ్ స్థానాలకు 22 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 242 వార్డు సభ్యులకు గాను కేవలం ఐదుమంది మాత్రమే నామినేషన్లు వేశారు. సర్పంచ్ స్థానానికి శేషంపల్లె నుంచి ఐదుగురు అభ్యర్థులు నా మినేషన్ వేయగా తాటికుంట గ్రామం నుం చి ముగ్గురు నామినేషన్ వేశారు. వార్డు సభ్యులకు తాటికుంట గ్రామం నుంచి నలు గురు మద్దెలబండ గ్రామం నుంచి ఒక్కరు మాత్రమే నామినేషన్ వేశారు. ఎల్కూరు, పెద్దొడ్డి, చర్లగార్లపాడు, పెద్దతండా, దాసరిపల్లె, పెద్దపల్లె, పావనంపల్లె, సద్దలోనిపల్లె, మండంపేట, ఉలిగేపల్లె గ్రామాల నుంచి అటు సర్పంచ్‌కు గానీ ఇటు వార్డు సభ్యులకు గానీ ఒక్క నామినేషన్ కూడా అందలేదని అధికారులు తెలిపారు.
నామినేషన్ కేంద్రాల పరిశీలన
మండలంలో మొదటిరోజు ప్రారంభమైన నామినేషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ పరిశీలించారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా నిబంధనల ప్రకారం నామినేషన్లు స్వీకరించాలని ఎన్నికల అధికారులకు సూచించారు. ఆయనతో పాటు ఎంపీడీఓ ఆంజనేయరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ సూర్యప్రకాశ్‌రెడ్డి ఉన్నారు.