Share News

కల్లాలు లేక.. కర్షకుల కష్టాలు

ABN , Publish Date - Nov 19 , 2025 | 11:23 PM

ఉమ్మడి గండీడ్‌ మండల వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం వానాకాలం, యాసంగి సీజన్లలో వరి, మొక్కజొన్న తదితర పంటలు కోయగానే రోడ్లపై ఆరబెట్టడం ఆనవాయితీగలా మారుతోంది.

కల్లాలు లేక.. కర్షకుల కష్టాలు
అన్నారెడ్డిపల్లి రోడ్డు మధ్యలో ఆరబోసిన ధాన్యం

- పంట దిగుబడులన్నీ రహదారులపైన ఆరబోత

- వాహనదారులకు తప్పని తిప్పలు

గండీడ్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి గండీడ్‌ మండల వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం వానాకాలం, యాసంగి సీజన్లలో వరి, మొక్కజొన్న తదితర పంటలు కోయగానే రోడ్లపై ఆరబెట్టడం ఆనవాయితీగలా మారుతోంది. రాత్రి, పగళ్లు రహదారులపైనే ఆరబెట్టడంతో వాహనదారులు రాత్రివేళ గుర్తించలేక పోతున్నారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో గాయపడటం, అక్కడక్కడా ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఉపాధి హామీ, గ్రామీణాభివృద్ధి, ఈజీఎస్‌, పంచాయతీరాజ్‌ శాఖల సమన్వయంతో కల్లాలు నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కల్లాల పరిణామాలు బట్టి రూ.60 వేల నుంచి రూ.85 వేల వరకు బిల్లులు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. కల్లాలు నిర్మించేందుకు రైతులకు ఆసక్తి ఉన్నా.. సకాలంలో బిల్లులు రాకపోవడంతో రైతుల ఆసక్తి చూపడం లేదు. దీనికి తోడు నిబంధనలకు విరుద్ధంగా కల్లాలు నిర్మిస్తున్నారని కేంద్రం వాటిని నిలిపివేయడంతో.. అన్నదాతల ఆశలు ఆవిరయ్యాయి.

కల్లాల బిల్లు చెల్లింపులు ఇలా..

8.33 మీటర్ల పొడవు 6 మీటర్ల వెడల్పుతో కల్లాలు నిర్మిస్తే రూ.56 వేలు, 8 మీటర్లు, 7.5 మీటర్లకు రూ.68 వేలు, 10 మీటర్లు, 7.7 మీటర్లకు రూ.85వేలు ప్రభుత్వం అందిస్తోంది. ఉమ్మడి గండీడ్‌ మండల వ్యాప్తంగా 400కు పైగా రైతుల నుంచి కల్లాలు నిర్మించుకుంటామని అప్లికేషన్లు రాగా, వాటిలో నిర్మించినవి 102 మాత్రమే. ఈ క్రమంలో రైతులు గత్యంతరం లేక రహదారులపై ఆరబోస్తున్నారు. మరి కొందరు కల్లాలు నిర్మించినప్పటికీ వాటి విస్తీర్ణం తక్కువగా ఉండడంతో మళ్లీ రోడ్లను ఆశ్రయిస్తున్నారు.

Updated Date - Nov 19 , 2025 | 11:23 PM