ప్రభుత్వ వైద్య కళాశాలపై ఎన్‌ఎంసీ అసంతృప్తి
ABN , Publish Date - Jun 17 , 2025 | 12:49 AM
మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్యకళాశాలపై జాతీయ వైద్య మండలి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
- ఐదింటిని గుర్తిస్తూ షోకాజ్ నోటీసులు జారీ
- ప్రధానంగా ఫ్యాకల్టీ, పడకలు, ఆపరేషన్ ఽథియేటర్ల లేమి
- ఈనెలాఖరుకు అన్నింటినీ సరిచేస్తామని హామీ
మహబూబ్‌నగర్(వైద్యవిభాగం), జూన్ 16 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్యకళాశాలపై జాతీయ వైద్య మండలి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కళాశాలలో వసతులు, ఫ్యాకల్టీ, పడకలు, ఆపరేషన్ థియేటర్ల లేమిని గుర్తించింది. మొత్తం 5 లోపాలను ఎత్తిచూపుతూ షోకాజు నోటీసులు జారీ చేసింది. అయితే ఆయా లోపాలను సరిదిద్దుకునేందుకు ఈనెల 18న ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని ఆదేశించింది. ఆ రోజున కళాశాల భవితవ్యం తేలనుంది.
ఎన్‌ఎంసీ తీవ్ర అసంతృప్తి...
జిల్లాలోని ప్రభుత్వ వైద్యకళాశాలలో 200 సీట్లకు అనుమతి కోసం కళాశాల అధికారులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో జాతీయ వైద్యమండలి(ఎన్‌ఎంసీ) బృందం కళాశాలతో పాటు జనరల్ ఆసుపత్రిలో కూడా తనిఖీలు చేసింది. రాష్ట్రంలోని 26 మెడికల్ కళాశాలలో పాటే పాలమూరు కళాశాలలో కూడా వసతుల లేమి ఉందని గుర్తించి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీంతో కళాశాలలో 5 లోపాలను గుర్తిస్తూ కళాశాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
గుర్తించినవి 5 లోపాలు...
కళాశాలలో ముఖ్యంగా ఫ్యాకల్టీ లోపాలను గుర్తించింది. ప్రస్తుతం కళాశాలలో 150 మెడికల్ సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది పదో బ్యాచ్ 200 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా ఎన్‌ఎంసీ బృందం కళాశాల, ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టింది. ఇందులో 5 లోపాలను గుర్తించింది. ప్రధానంగా ఫ్యాకల్టీ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేసింది. కళాశాలలో 200 సీట్లకుగానూ ఫ్యాకల్టీ(ప్రొఫేసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫేసర్లు) 232 మంది ఉండాలి. కానీ 129 మంది మాత్రమే ఉన్నారు. అదేవిధంగా సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్లు మొత్తం 115 మంది ఉండాల్సింది కేవలం 80 మంది మాత్రమే ఉన్నారు. దీంతో పాటు 770 పడకలకు గానూ 710 మాత్రం ఉన్నాయి. అవి కూడా ఖాళీగా ఉన్నాయి. మేజర్ ఆపరేషన్ థియేటర్లు 10కిగానూ 8, మైనర్ ఆపరేషన్ థియేటర్లు 5కు గానూ 3 ఉన్నాయి. అంతేకాకుండా కెడావర్(శవాలు) 18 ఉండాల్సింది 12 మాత్రమే ఉన్నాయి. హిస్టోఫాథాలజి పరీక్షలు కూడా తక్కువగా ఉన్నాయి. ఈ 5 లోపాలను గుర్తించి షోకాజు నోటీసులు జారీ చేసింది.
సరిచేస్తామని హామీ.,.
ఎన్‌ఎంసీ గుర్తించిన లోపాలపై సమీక్ష చేసేందుకు జిల్లా మెడికల్ కళాశాల అధికారులు సోమవారం డీఎంఈ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఈ 5 లోపాలపై సమీక్షించారు. ఇందులో ఫ్యాకల్టీ నియామకాలపై చర్చించారు. ఈనెలాఖరు నాటికి పదోన్నతులు కల్పించడంతో పాటు కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ పద్ధతిన ఫ్యాకల్టీని నియమించేందుకు నిర్ణయించారు. అదేవిధంగా పడకల విషయంలో సరిపడినన్ని పడకలు ఉన్నప్పటికీ ఏర్పాటు చేయడానికి స్థలాభావం కారణంగా పెట్టలేకపోతున్నామని, కొత్త ఆసుపత్రి నిర్మాణం పూర్తయిన తర్వాత పడకల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు. ఆపరేషన్ థియేటర్ల విషయంలో కూడా లోపాలు లేవని, మైనర్ ఓటీలు కూడా కొత్త ఆసుపత్రి ఏర్పాటైన తర్వాత పెంచుకుంటామని కూడా సమావేశం దృష్టికి తెచ్చారు. దీంతో పాటు కెడావర్లు 6 మాత్రమే తక్కువ ఉన్నాయని, ఏవైనా అనాథ శవాలు గానీ, దాతల నుంచి గానీ సేకరిస్తామని కూడా తెలిపారు. హిస్టో ఫ్యాథాలజి పరీక్షల సంఖ్యను కూడా పెంచుతామని పేర్కొన్నారు.
18న తేలనున్న భవితవ్యం..
ఈనెల 18న ప్రభుత్వ వైద్య కళాశాల భవితవ్యం తేలనుంది. గుర్తించిన లోపాలు, షోకాజ్ నోటీసులపై సంజాయిషీ ఇవ్వాలని, ఇందుకోసం ఈనెల 18న ఢిల్లీకి రావాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి, డీఎంఈలను ఆదేశించింది. అయితే ఆ లోపాలను సరిచేస్తామని అన్ని కళాశాలల నుంచి హామీ పత్రాలు ఇవ్వనున్నారు. కానీ వాటికి కూడా సంతృప్తి చెందక సీట్లు తగ్గిస్తారా...? జరిమానాలు విధిస్తారా...? మందలించి వదిలేస్తారా..? అనే దానిపై స్పష్టత రానుంది.