ఈనెల 13న జాతీయ లోక్‌అదాలత్
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:10 PM
జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లాలోని అన్ని కోర్టుల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయమూర్తి బి.పాపిరెడ్డి పేర్కొన్నారు.
- జిల్లా న్యాయమూర్తి బి పాపిరెడ్డి
మహబూబ్‌నగ ర్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లాలోని అన్ని కోర్టుల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయమూర్తి బి.పాపిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులతో పాటు ఇది వరకు కోర్టు ముందుకు రాని కేసులు పరిష్కరించుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందన్నారు. లోక్ అదాలత్ ద్వారా ఇరువర్గాలు తక్షణ పరిష్కారం పొందవచ్చని, సమయం, డబ్బు వృథా కాకుండా ఉంటుందన్నారు. రాజీ కాదగిన క్రిమినల్, సివిల్ కేసులు, కుటుంబ తగాదాలు, డబ్బు రికవరీకి సంబంధించిన కేసులు, మోటార్ వెహికిల్ ఆక్సిడెంట్‌లు, చిట్‌ఫండ్ కేసులు, ఎలక్ట్రిసిటీ కేసులు, డ్రంకెన్ డ్రైవ్, చెక్ బౌన్స్, బ్యాంక్‌కు సంబంధించిన కేసులు, బీఎస్‌ఎన్‌ఎల్ ప్రీలిటిగేషన్ కేసులను సులువుగా పరిష్కరించుకోవచ్చని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 8 బెంచ్‌లు ఏర్పాటు చేసి కేసుల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 1,748 కేసులను గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. లోక్‌అదాలత్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని, ఈ అవకాశాన్ని కక్షిదారులు, న్యాయవాదులు వినియోగించుకోవాలని కోరారు.