ఎంపీడీవో కార్యాలయానికి తాళం
ABN , Publish Date - Jun 09 , 2025 | 11:32 PM
అద్దె డబ్బులు ఇవ్వడం లేదని ఎంపీడీవో కార్యాలయానికి భవనం యజమాని దంపతులు తాళం వేశారు.
- 36 నెలలుగా భవనం అద్దె బకాయి
- అధికారులతో యజమాని వాగ్వాదం
- మూడు గంటల పాటు ఆరుబయటే ఎంపీడీవో, ఉద్యోగులు
అమరచింత, జూన్ 9 (ఆంధ్రజ్యోతి) : అద్దె డబ్బులు ఇవ్వడం లేదని ఎంపీడీవో కార్యాలయానికి భవనం యజమాని దంపతులు తాళం వేశారు. దీంతో మూడు గంటల పాటు అధికారులు, ఉద్యోగులు అరుబయటే ఉండాల్సి వచ్చింది. వనపర్తి జిల్లా, అమరచింతలో ఈ సంఘటన జరిగింది. అమరచింత మండలంగా ఏర్పడినప్పటి నుంచి ఎంపీడీవో కార్యాలయం అద్దె భవనంలోనే కొనసాగుతోంది. అద్దె బకాయిల కోసం కార్యాలయానికి తాళం వేయడం ఇది నాలుగవ సారి. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రెండుసార్లు, తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గత డిసెంబర్‌లో కూడా కార్యాలయానికి తాళం వేశారు. దీంతో అప్పటి ఎంపీడీవో 31 నెలల అద్దె బకాయికి సంబంధించి రూ. 3.10 లక్షల చెక్కును సిద్ధం చేసి ఎస్‌టీవోకు పంపించారు. కానీ ఇప్పటికీ ఆ డబ్బు యజమానికి అందలేదు. దీంతో మొత్తం 36 నెలల అద్దె బకాయిలు రాకపోవడంతో యజమాని సురేందర్ దంపతులు సోమవారం ఉదయం 9 గంటలకు కార్యాలయానికి తాళం వేశారు. 10 గంటల సమయంలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కార్యాలయానికి చేరుకున్నారు. తాళం వేసి ఉండటంతో మూడు గంటల పాటు అరుబయటే వేచి ఉన్నారు. ఎంపీడీవో చెన్నమ్మ, ఎంపీవో నరసింహయ్య, పోలీసులు కలిసి ఇంటి యజమాని సురేందర్ దంపతులతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. చివరకు కలెక్టర్, అదనపు కలెక్టర్లతో ఎంపీడీవో ఫోన్‌లో మాట్లాడారు. వారి ఆదేశం మేరకు మిగిలిన ఐదు నెలల చెక్కును వెంటనే సిద్ధం చేసి, మొత్తం 36 నెలల అద్దె డబ్బులు త్వరలో వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో యజమాని కార్యాలయం తాళం తీయడంతో వివాదం సద్దు మణిగింది.