పశ్చిమ బెంగాల్‌కు తల్లీ బిడ్డలు
ABN , Publish Date - May 20 , 2025 | 11:20 PM
పశ్చిమ బెంగాల్‌కు చెందిన దంపతులు జీవనోపాధి కోసం మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్లకు వలస వచ్చారు.
- ఉపాధి కోసం జడ్చర్లకు వలస వచ్చిన దంపతులు
- గొడవ పడి భార్యను వదిలేసి వెళ్లిపోయిన భర్త
- గత డిసెంబర్‌లో మగ బిడ్డకు జన్మనిచ్చిన సంజన
- ఇద్దరినీ కోల్‌కతాలోని శక్తిసదన్‌కు తరలింపు
జడ్చర్ల, మే 20 (ఆంధ్రజ్యోతి) : పశ్చిమ బెంగాల్‌కు చెందిన దంపతులు జీవనోపాధి కోసం మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్లకు వలస వచ్చారు. వారిద్దరి మధ్య గొడవ జరగడంతో భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటికే గర్భవతిగా ఉన్న ఆమె మొగ బిడ్డకు జన్మనిచ్చింది. స్థానికంగా ఏ దిక్కు లేని వారిద్దరినీ మహబూబ్‌నగర్ సఖి కేంద్రం నిర్వాహకులు పశ్చిమబెంగాల్‌కు పంపించారు. సఖి కేంద్రం అడ్మిన్ సౌజన్య తెలిపిన వివరాల మేరకు... పశ్చిమబెంగాల్ రాష్ట్రం, సౌత్ 24 పర్ణణాస్, గంగాసాగర్ గ్రామానికి చెందిన సంజన, లక్కి దంపతులు జీవనోపాధి కోసం గత ఏడాది డిసెంబరులో జడ్చర్ల మండలం పెద్దపల్లికి వలస వచ్చారు. ఆ సమయంలో సంజన గర్భవతిగా ఉంది. కాగా భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో భర్త లక్కీ సంజనను వదిలేసి స్వగ్రామానికి వెళ్లిపోయాడు. గత ఏడాది డిసెంబర్ 31న ఆమెకు పురుటినొప్పులు రావడంతో ఇరుగు, పొరుగు వారు జడ్చర్ల ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత పుట్టిన బాబును విక్రయించేందుకు ప్రయత్నిస్తోందన్న అనుమానంతో స్థానికులు సఖి కేంద్రం నిర్వాహకులకు సమాచారం అందించారు. దీంతో వారు సంజనతో పాటు పుట్టిన బాబును జనవరి 4న తమ అధీనంలోకి తీసుకుని జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రానికి తరలించారు. జనవరి 8వ తేదీ వరకు తమ అధీనంలో ఉన్న సంజన, పసిపాపలను జిల్లా కేంద్రంలోని స్టేట్‌హోంకు తరలించారు. ఆ తర్వాత డీడబ్ల్యువో జరీనాబేగం సహకారంతో పశ్చిమబెంగాల్ డైరెక్టరేట్ ఆఫ్ సోషల్ వెల్‌ఫేర్ అధికారులను సంప్రదించారు. కానీ సంజన కుటుంబసభ్యుల వివరాలు తెలియలేదు. దీంతో సంజనతో పాటు పసిపాపను కోల్‌కతాలోని శక్తిసదన్‌లో లాంగ్‌టర్మ్ షెల్టర్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. అందుకోసం తల్లీబిడ్డలను మంగళవారం జిల్లా కేంద్రం నుంచి పశ్చిమబెంగాల్‌కు తరలించారు.