మరిన్ని ‘మీ సేవ’లు
ABN , Publish Date - Jul 21 , 2025 | 11:23 PM
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అ వసరం లేకుండా ‘మీ సేవ’ కేంద్రాల్లో మరిన్ని మెరుగైన సేవలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
- గత ఏడాది అదనంగా తొమ్మిది రకాల సేవలు
- ఈ ఏడాది వివాహ రిజిస్ర్టేషన్, మార్కెట్ వాల్యుయేషన్ పత్రాల జారీ
- స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికెట్లు పొందే సదుపాయం
- నారాయణపేట జిల్లాలో 84 కేంద్రాలు
నారాయణపేట, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అ వసరం లేకుండా ‘మీ సేవ’ కేంద్రాల్లో మరిన్ని మెరుగైన సేవలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ధ్రువపత్రాల జారీలో జాప్యాన్ని నివారించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2011లో సులభంగా.. వేగంగా.. అనే నినాదంతో మీ సేవ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొదట్లో కొన్ని రకాల సేవలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఆ తర్వాత దశల వారీగా సేవలను విస్తరించారు. ప్రస్తుతం రెవెన్యూ, రవాణా, పోలీస్, మునిసిపల్, విద్యు త్, దేవాదాయ, వ్యవసాయం, రిజిస్ట్రేషన్, పౌ రసరఫరాలు, విద్యాశాఖలకు చెందిన 300 రకాల పౌర సేవలను అందిస్తున్నారు.
దశల వారీగా సేవల పెంపు
గతంలో అందిస్తున్న సేవలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం 2024, ఆగస్టు 31న 9 రకాల సేవ లను మీ సేవ పరిధిలోకి తీసుకొచ్చింది. అందులో రెవెన్యూశాఖ పరిధిలోని విద్యార్థి గ్యాప్ సర్టిఫికెట్, పేరు మార్పిడి, కులం, ఆదాయం, మైనారిటీ, క్రిమీ లేయర్-నాన్ క్రిమీ లేయర్, వయో వృద్ధుల నిర్వహణ, కేసుల పర్యవేక్షణ సేవలు ఉన్నాయి. అలాగే అటవీ శాఖ పరిధిలో వన్యప్రాణుల దాడిలో మృతి చెందిన మనుషులు, జంతువులకు పరిహరం, కలప (టింబర్) డిపోలు, సామిల్ అనుమతులు, క్రమబద్ధీకరణ, నిర్వహణ తదితర సేవలను మీ సేవ జాబితాలో చేర్చింది. తాజాగా గత నెల 27 నుంచి రిజిస్ట్రే షన్ శాఖకు చెందిన వివాహ ధ్రువీకరణ, వ్యవసాయయేతర భూముల మార్కెట్ విలు వ పత్రాల (వాల్యుయేషన్) సేవలను అం దులో చేర్చారు. నారాయణపేట జిల్లా వ్యాప్తం గా 84 మీ సేవ కేంద్రాలున్నాయి. రూరల్, గ్రామీణ ప్రాంతాల్లో 77, పట్టణ ప్రాంతాల్లో 6 కేంద్రాలున్నాయి. వీటితో పాటు నారాయణ పేట మునిసిపల్ ఆవరణలో ప్రభుత్వానికి సంబంధించిన మీ సేవ కేంద్రం ఉంది.
వివాహ రిజిస్టేషన్ కోసం..
గతంలో వివాహ రిజిస్ట్రేషన్ కోసం టీ-పోలియో యాప్ ద్వారా, లేకుంటే ఏజెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మీ సేవ కేంద్రాల్లోనే స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అందుకోసం యువతీ యువకుల ఆధార్, వయసు ధ్రువీకరణ, ఇరు వైపుల వారి పెళ్లి పత్రికలు, తల్లిదండ్రుల వివరాలు, రెండు పెళ్లి ఫొటోలు, ముగ్గురు సాక్షుల ఆధార్ కార్డులు, ఆలయంలో పెళ్లి చేసుకుంటే సంబంధిత రశీదును అందించాల్సి ఉంటుంది. ఆ వివరాలను మీసేవ నిర్వాహ కులు ఆన్‌లైన్లో నమోదు చేసి స్లాట్ బుక్ చేస్తారు. నిర్ణీత తేదీ, సమయం మేరకు దం పతులు, ముగ్గురు సాక్షులతో కలిసి సబ్ రిజిస్ట్రార్ ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. ఆయన వాటిని పరిశీలించి వివాహ ధ్రువీ కరణ పత్రాన్ని జారీ చేస్తారు.
మార్కెట్ విలువ పత్రాల జారీ
గృహ నిర్మాణాలు, ఇతర బ్యాంకు రుణాల కోసం వ్యవసాయేతర భూములకు మార్కెట్ విలువను నిర్ధారించే (వాల్యుయేషన్) ధ్రువప త్రాలు తప్పనిసరి. గతంలో వీటిని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మ్యానువల్‌గా తీసుకోవాల్సి ఉండేది. ప్రస్తుతం వాటిని కూడా మీసేవ కేంద్రాల ద్వారా అందిస్తున్నారు. అందుకోసం ఆధార్‌కార్డు, ఇల్లు, స్థలం డాక్యుమెంట్లు, పన్ను రశీదు, జిల్లా, గ్రామం, మండలం వివ రాలను సమర్పించాలి ఉంటుంది.
సేవలను సద్వినియోగం చేసుకోవాలి
మీసేవ ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలి. తాజాగా వివాహ రిజిస్టేషన్, మార్కెట్ విలువ సర్టిఫికెట్ల జారీకి స్లాట్ బుకింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మీ సేవ కేంద్రాల నిర్వహకులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ప్రజల నుంచి నిర్ధారిత రుసుమును మాత్రమే తీసుకోవాలి. అధికంగా వసూలు చేసినా, ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటాం.
- విజయ్ కుమార్, జిల్లా మేనేజర్, మీసేవ, నారాయణపేట.