అంతకుమించి..
ABN , Publish Date - Dec 05 , 2025 | 11:14 PM
పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకుంటున్నాయి. మొదటి విడత అభ్యర్థులు బరిలోకి దిగి ప్రచారం చేస్తుండగా.. రెండో విడత అభ్యర్థులు సంసిద్ధులవుతున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం రాణిపేటలో జొన్న రొట్టలు కాలుస్తున్న సర్పంచు అభ్యర్థి
మేజర్ జీపీల్లో రూ.కోటి వరకూ ఖర్చు చేయడానికీ రెడీ
ఏకగ్రీవాల్లోనూ ఇదే తంతు..
ఎమ్మెల్యేల స్థాయిలో హామీలు
ఈగోతో ఖర్చు.. గెలిచి వస్తేనే డబ్బులు అంటున్న ఎమ్మెల్యేలు
మహబూబ్‌నగర్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకుంటున్నాయి. మొదటి విడత అభ్యర్థులు బరిలోకి దిగి ప్రచారం చేస్తుండగా.. రెండో విడత అభ్యర్థులు సంసిద్ధులవుతున్నారు. మూడో విడత మండలాల్లో కూడా రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయి. అయితే గతంలో కంటే ఈసారి ఎన్నికలు భిన్నంగా జరుగనున్నాయి. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ ఓవైపు గ్రామాల్లో బలంగా ఉంటే.. మరోవైపు పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రె్‌సకు పోటీ ఎక్కువగా ఉంది. ఎలాగైనా స్థానిక సంస్థల్లో తామే గెలుపొందాలనే సంకల్పంతో అభ్యర్థులు కష్టపడుతున్నారు. అయితే పోటీ ఎక్కువగా ఉంటే ఖర్చు పెరగడం సహజం. కానీ ఈసారి ఎమ్మెల్యే ఎన్నికలకు మించిన ఖర్చు పంచాయతీల్లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచీ ఏకగ్రీవాల కోసం వేలం పాటల్లో కూడా ఈ తంతు చూశాం. హన్వాడ మండలం టంకరలో అయితే వేలం పాట రూ.కోటి దాటిన విషయం అందరికీ తెలిసిందే. గద్వాల జిల్లాలో రూ.60 లక్షల వరకు పలికిన గ్రామాలు ఉన్నాయి. వర్గపోరుతో ఏకగ్రీవాలు కాకపోయినప్పటికీ, పోటీ తీవ్రం కావడం వల్ల ఖర్చుకు వెనుకాడే పరిస్థితి లేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఆర్థికంగా లేని అభ్యర్థులు అప్పులు చేస్తుండగా, ఆస్తిపాస్తులు ఉన్నవారు వాటిని అమ్ముకుంటున్నారు. రెవెన్యూ ఎక్కువగా ఉండే మేజర్ పంచాయతీల్లో ఖర్చు రూ.కోటి దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఎంత చిన్న పంచాయతీ అయినా సర్పంచు అభ్యర్థికి రూ.5 లక్షలపైనే చేతి చమురు వదలనుంది. ఈ పోటీ ఆర్థికంగా లేనివారికి కొంత కష్టంగా మారనుంది. వారు ఎలాగైనా నెగ్గాలని భావిస్తున్నప్పటికీ, డబ్బులు ఎలా సమకూర్చుకోవాలో సతమతమవుతున్నారు.
ఈగోతోనే తంటాలు..
సాధారణంగా గ్రామ పంచాయతీల్లో పోటీ రసవత్తరంగా ఉంటుంది. అందరూ తెలిసిన వారే అయినప్పటికీ ఏళ్లుగా పార్టీల వారీగా, సందర్భాల వారీగా, వివిధ విభేదాల వల్ల గ్రామాల్లో పోటీపడుతున్న వారు ఉంటారు. పార్టీలు కూడా అలాంటి వారికే మద్దతు ఇచ్చి గెలిపిస్తాయి. ఈ క్రమంలో కేవలం ఈగోలకు పోయి ఈసారి పంచాయతీ ఎన్నికల్లో అధిక ఖర్చుకు వెనుకాడటం లేదు. ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఇంత ఖర్చు పెట్టి ఏం చేయగలం?, ప్రభుత్వాల నుంచి సమయానుకూలంగా నిధులు రాకుంటే ఎలా? అనే విషయాలనను అస్సలు పట్టించుకోవడం లేదు. అవతలి పార్టీ వ్యక్తిపైనా లేదా అదే పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న మరో రెబల్‌పైన పంతం నెగ్గించుకోవాల్సిందేనని సంకల్పిస్తున్నారు. కొందరు విదేశాల నుంచి వచ్చి మరీ నామినేషన్లు వేసి బరిలో నిలిచారు. బిజినేపల్లి మండలం లట్టుపల్లి సర్పంచు అభ్యర్థిగా కమతం నందిని అమెరికా నుంచి వచ్చి పోటీలో నిలిచారు. గద్వాల మండలం బీరెల్లి గ్రామానికి చెందిన కవిత కూడా ఆస్ర్టేలియాలో కొడుకు దగ్గర నుంచి వచ్చి నామినేషన్ వేశారు. పెబ్బేరు మండలం ఏటిగడ్డ శాఖాపూర్‌లో సివిల్స్‌కు సన్నద్ధమవుతున్న గ్రీష్మా, ఎంబీబీఎస్ చేస్తున్న కేఎన్ నిఖిత పోటీ చేస్తున్నారు.
అభివృద్ధికి బాండ్ పేపర్
ఇదిలా ఉంటే ఎమ్మెల్యేల స్థాయిలో అలవికాని హామీలు కూడా ఇస్తున్నారు. గద్వాల జిల్లా గట్టు మండలం సుల్తాన్‌పూర్‌లో సర్పంచు అభ్యర్థి తాను చేసే పనులపై బాండ్ పేపర్ రాసి మరీ ఇవ్వగా.. మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాలలో కూడా అభ్యర్థి కవిత బాండ్ రాసిచ్చారు. మాజీ సర్పంచులు పాత బిల్లులు రాక.. అప్పులపాలై ఇబ్బందులు పడుతున్న విషయం కళ్లెదుట కనిపిస్తున్నా.. కొత్త అభ్యర్థులు, కొందరు మాజీలు కూడా ఖర్చుకు వెనుకాడకపోవడం గమనార్హం.
గెలిచిన తర్వాతే డబ్బులు..
ఏ ఎన్నిక వచ్చినా అధినాయకుల వద్ద ఖర్చు కోసం ఆశపడటం స్థానిక అభ్యర్థుల్లో కనిపిస్తుంది. అది కూడా ఆర్థికంగా లేక, బరిలో నిలవాలనుకునే వారి నుంచే ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు డబ్బులు అడిగితే ఆముదం పూసుకున్నట్లు జారుకుంటున్నారు. గెలిచిన తర్వాతనే డబ్బులు, అభివృద్ధికి నిధులు ఇస్తామని చెబుతున్నారు. అధికార పార్టీకి మెజారిటీ గ్రామాల్లో ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉండటంతో ఎవరికి ఇచ్చినా గ్రామంలో తనకు ఇబ్బంది ఎందుకనే ధోరణి కనిపిస్తోంది. అయితే ఈగోకు పోయి పోటీ పడుతుండటం, కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు చెప్పినా వినకపోవడంతో గెలిచిన తర్వాత రావాలని చెబుతున్నారు. ఇక ఏకగ్రీవ పంచాయతీలకు సంబంధించి ఏ గుర్తు లేకపోవడంతో కొందరు అధికారపార్టీ అని చెబుతుండగా.. మరికొందరు బీఆర్‌ఎస్ అని చెబుతున్నారు. ఒకసారి చెప్పిన మాట మరోసారి ఉండటం లేదు. ఈ శిబిరం నుంచి ఆ శిబిరంలోకి వెళ్తున్నారు. ఎవరు ఎక్కువ ఇస్తానంటే వారివైపు మళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికలు పూర్తయ్యే సమయానికి ఎవరు ఏ పార్టీలో ఉంటారో తేలనుంది.