మధ్యాహ్నం మాంసాహారం.. రాత్రికి మందు
ABN , Publish Date - Dec 06 , 2025 | 11:21 PM
పంచాయతీ ఎన్నికల మొదటి, రెండు విడతలకు సంబంధించి ఉప సంహరణ పూర్తయి, గుర్తులు కేటాయించడంతో ఆయా గ్రామాల్లో ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేస్తూ, మద్దతు కూడగడుతున్నారు.
అభ్యర్థులకు సండే ఎఫెక్ట్
మొదటి విడత ఎన్నికల గ్రామాల ఓటర్లకు ఫుల్ దావత్
పోటీ గట్టిగా ఉన్నచోట తెగనున్న పొట్టేళ్లు
మహబూబ్‌నగర్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల మొదటి, రెండు విడతలకు సంబంధించి ఉప సంహరణ పూర్తయి, గుర్తులు కేటాయించడంతో ఆయా గ్రామాల్లో ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేస్తూ, మద్దతు కూడగడుతున్నారు. ఈ నెల 11న గురువారం మొదటి విడత ఎన్నికలు జరుగనున్నందున ఆ అభ్యర్థులకు నేడు ఆదివారం సందర్భంగా ఖర్చు గట్టిగానే ఉండనుంది. ఇప్పటిదాకా పప్పన్నంతో నెట్టుకువచ్చిన అభ్యర్థులకు.. ఆదివారం చాలా చోట్ల మాంసాహారం పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మధ్యాహ్నం చికెన్ రైస్, చికెన్ బిర్యానీ లేదంటే పోటీ గట్టిగా ఉన్నచోట పొట్టేళ్లు తెగనున్నాయి. రాత్రికి మందు దావత్‌లు ఇచ్చేందుకు అభ్యర్థులు రెడీ అవుతున్నారు. ఆదివారం రోజంతా దావత్‌లు సాగనున్నాయి. యువతకు కాటన్లకొద్దీ బీర్లు తీసుకెళ్తున్నారు. రోజూ చీప్ లిక్కర్ తాగేవాళ్లు కూడా బ్రాండ్ మారుస్తున్నారు. బీర్ తాగని వాళ్లు కూడా అవి కావాలంటున్నారు.
ఉదయం 6 గంటల నుంచే
అభ్యర్థులు ఉదయం 6 గంటల నుంచే ఇంటింటి ప్రచారం మొదలవుతోంది. టీ తాగి ప్రచారానికి వెళ్తున్నారు. 9 గంటల వరకు తిరిగిన తరువాత బయట నుంచి తెప్పించిన టిఫిన్ లేదంటే పోటీ చేసే అభ్యర్థుల ఇళ్లవద్ద ఉప్మా లేదా ఉగ్రాని వంటి టిఫిన్లు వెంట తిరిగిన వాళ్లకు పెడుతున్నారు. తరువాత మళ్లీ ప్రచారం చేశాక, మధ్యాహ్నం భోజనం చేయిస్తున్నారు. 3 గంటలకు ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోతున్నారు. సాయంత్రం 6 గంటలకు మళ్లీ ప్రచారం ప్రారంభిస్తున్నారు. 9 గంటల వరకు ప్రచారం చేశాక, ఇంటికి వెళ్ళేవారికి ఒక క్వార్టర్ ఇచ్చి పంపుతున్నారు. ఉదయం, మధ్యాహ్నం కన్నా సాయంత్రం ప్రచారానికి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వెంట తిరిగే మహిళకు రోజూ రూ.300 నుంచి రూ.400 చొప్పున కూలీ మాట్లాడుకుంటున్నారు. సీసీకుంట మండలం పెద్దవడ్డేమాన్, అమ్మాపూర్‌లో దాదాపుగా ఇదేరకమైన ప్రచారం సాగుతోంది.