రేపు అయ్యప్ప కొండపై మహాపూజ
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:30 PM
పాలమూరు నగరంలోని పద్మావతి కాలనీ అయ్యప్ప కొండపై గురువారం ఆయ్యప్ప స్వామి మహాపూజ నిర్వహిస్తున్నట్లు అయ్యప్ప సేవా సమాజం అధ్యక్షుడు భగవంతురావు తెలిపారు.
- సేవా సమాజం అధ్యక్షుడు భగవంతురావు
మమబూబ్‌నగర్ న్యూటౌన్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : పాలమూరు నగరంలోని పద్మావతి కాలనీ అయ్యప్ప కొండపై గురువారం ఆయ్యప్ప స్వామి మహాపూజ నిర్వహిస్తున్నట్లు అయ్యప్ప సేవా సమాజం అధ్యక్షుడు భగవంతురావు తెలిపారు. అయ్యప్ప కొండపై మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 5 గంటల నుంచి 8.30 గంటల వరకు సుప్రభాత సేవ, గణపతి, నవగ్ర హోమం, నిత్యాభిషేకం ఉంటుందన్నారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 10 గంటలకు తూర్పు కమాన్ వద్దనున్న రామాలయం నుంచి కలశం ఊరేగింపు, స్వామి వారి పల్లకీ సేవ ప్రారంభం అవుతుందన్నారు. నగరంలోని ప్రధాన రహదారుల మీదుగా అయ్యప్ప కొండ వరకు కొనసాగుతుందని తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంటకు భక్తులకు అన్నదానం ఉంటుందన్నారు. సాయంత్రం 7.30 గంటలకు తిరుపతికి చెందిన వెంకటేశ్వర చంద్రమౌలి శర్మ, పాలమూరు పట్టణ గురుస్వాముల ఆధ్వర్యంలో ఏకశిల దివ్య పదునెట్టాంబడి పూజ నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ విశేష పూజా కార్యక్రమాల్లో పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మహాపడిపూజ కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో సేవ సమాజం ప్రధాన కార్యదర్శి ముత్యం గురుస్వామి, పంబరాజు, కేశవులు హర్షదవర్ధన్ రెడ్డి, ప్రసాద్, గణేశ్, యాదయ్య పాల్గొన్నారు.