10 వికెట్ల తేడాతో మహబూబ్‌నగర్ గెలుపు
ABN , Publish Date - Jun 03 , 2025 | 11:24 PM
హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్‌సీఏ) అండర్-19 ఉమ్మడి జిల్లా వన్‌డే క్రికెట్‌లో మహబూబ్‌నగర్ జట్టు నాగర్‌కర్నూల్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
- అర్ధసెంచరీతో రాణించిన అబ్దుల్ రఫె
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్‌సీఏ) అండర్-19 ఉమ్మడి జిల్లా వన్‌డే క్రికెట్‌లో మహబూబ్‌నగర్ జట్టు నాగర్‌కర్నూల్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సమర్థ పాఠశాల మైదానంలో మంగళవారం నిర్వహించిన మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ - నాగర్‌కర్నూల్ జట్లు తలబడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన నాగర్‌కర్నూల్ జట్టు 28.5 ఓవర్లలో 70 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో చరణ్ 10, లక్ష్మణ్‌యాదవ్ 10 పరుగులు చేశారు. మహబూబ్‌నగర్ బౌలర్లలో నవీన్‌కుమార్ 2, ప్రణవ్ 2, అభినవ్ 2, యువన్ ముద్దసాని 2 వికెట్ల తీసి తక్కువ స్కోర్‌కే నాగర్‌కర్నూల్‌ను అవుట్ చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మహబూబ్‌నగర్ జట్టు 11.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టులో అబ్దుల్ రఫె 36 బంతుల్లో 11 ఫోర్లతో అర్ధసెంచరీ (52), కాన్షిక్ 18 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. వరుస విజయాలు సాధించడంపై జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ జట్టుకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కోచ్ అబ్దుల్లా, సీనియర్ క్రీడాకారుడు మన్నాన్ పాల్గొన్నారు.