దర్శనమిచ్చిన సలేశ్వరుడు
ABN , Publish Date - Apr 11 , 2025 | 11:02 PM
ప్రతీ ఏటా చైత్ర పౌర్ణమికి భక్తులకు దర్శనమిచ్చే సలేశ్వరం లింగమయ్య స్వామిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్టాల నుంచే

- అన్ని దారులు అటవీ మార్గం వైపే..
- నిబంధనలు పాటించాలంటున్న అధికారులు
అచ్చంపేట, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): ప్రతీ ఏటా చైత్ర పౌర్ణమికి భక్తులకు దర్శనమిచ్చే సలేశ్వరం లింగమయ్య స్వామిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్టాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట తదితర రాష్టాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. శుక్రవారం నుంచి అటవీ దారులు తెరుచుకోవడంతో పెద్ద సంఖ్యలో భక్తులు, పర్యాటకులు తరలి వెళుతున్నారు. పరహాబాద్ చౌరస్తా నుంచి దాదాపు 18 కిలోమీటర్ల దూరం దట్టమైన అటవీ మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. రాంపూర్ పెంట వరకు వాహనాలలో వెళ్లి అక్కడి నుంచి మోకాళ్ల కురువ ప్రాంతం వరకు ఆటోలో వెళ్తారు. అక్కడినుంచి కాలినడకన మహిమాన్విత లింగమయ్య స్వామిని దర్శించుకుంటున్నారు. మొదటి రోజు అన్నిదారులు సలేశ్వరం వైపే అన్నట్లుగా పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, బస్సులు తరలివెళుతున్నాయి. అధికా రులు దీనికి అనుగుణంగా ఏర్పాట్లను చేశారు. అనారోగ్య సమస్యలు ఉన్నవా రు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పరహాబాదు, రాంపూర్, మోకాళ్ల కురువ వద్ద ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు మహిళలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేశారు. మోకాళ్ల కురువ సమీపంలో అన్నప్రసాదాల పంపిణీకి వివిధ స్వచ్ఛంద సంస్థల వారు ఏర్పాట్లు చేశారు.
అటవీ నిబంధనలు పాటించాలంటున్న అటవీశాఖ
నల్లమల అభయారణ్యంలో ప్రయాణించాలంటే అటవీశాఖ నిబంధనలు పాటించాలని అటవీశాఖ భక్తులకు పలు సూచనలు చేస్తున్నది. అటవీ మార్గంలో ప్లాస్టిక్ బాటిళ్లు వేయరాదని, మద్యం సేవించడం ధూమపానం చేయడం వంటివి నిషేధం. జంతువులకు హాని తలపెట్టే కార్యక్రమాలు చేయరాదని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. 3 రోజులు జరిగే ఉత్సవాలకు అడవి మార్గంలో వెళ్లాలంటే ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పరహాబాదు చౌరస్తా నుంచి ట్రాక్టర్, కారుకు 600, ఆటోకు 200, ద్విచక్ర వాహనానికి 100,డీసీఎం, ప్రైవేటు బస్సులకు 1000 చొప్పున ఎంట్రీ ఫీజు అటవీ శాఖ సిబ్బంది డబ్బులు వసూల్ చేస్తున్నారు.