స్వామియే శరణం అయ్యప్ప!
ABN , Publish Date - Dec 25 , 2025 | 11:30 PM
స్వామియే శరణం అయ్యప్ప.. హరిహర పుత్రా అయ్యప్ప.. అంటూ భక్తుల శరణుఘోషతో పాలమూరు పట్టణం మారుమోగింది.
- శరణుఘోషతో మారుమోగిన పాలమూరు
- అయ్యప్ప కొండపై భక్తి శ్రద్ధలతో మహా పడిపూజ
- పట్టణంలో కనుల పండువగా శోభాయాత్ర
- దేవతల వేషధారణతో ఆకట్టుకున్న చిన్నారులు
- పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ, మాజీ మంత్రి
మహబూబ్‌నగర్ న్యూటౌన్, డిసెంబరు 25 (ఆంరఽధజ్యోతి) : స్వామియే శరణం అయ్యప్ప.. హరిహర పుత్రా అయ్యప్ప.. అంటూ భక్తుల శరణుఘోషతో పాలమూరు పట్టణం మారుమోగింది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ సమీపంలోని అయ్యప్పకొండపై గురువారం 28వ వార్షిక అయ్యప్ప మహాపడిపూజా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి సన్నిధిలో ప్రభాతసేవ, గణపతిహోమం, నిత్యాభిషేకం చేశారు. అనంతరం నగరంలోని తూర్పుకమాన్ నుంచి 18 కళశాలతో నిర్వహించిన శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. నగరంలోని రాంమందిర్ చౌరస్తా, గడియారం చౌరస్తా, అశోక్ టాకీస్ చౌరస్తా, ఫారెస్ట్ కార్యాలయం, పాత కలెక్టరేట్, న్యూటౌన్, మెట్టుగడ్డ మీదుగా శోభాయాత్ర పద్మావతి కాలనీలోని అయ్యప్ప కొండకు చేరుకున్నది. రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద శోభాయాత్రలో స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అయప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ చేశారు. గడియారం చౌరస్తా వద్ద శోభాయాత్రలో మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కర్రసాము చేసి భక్తులను ఉత్తేజపరిచారు. దేవతామూర్తుల వేషధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారు. అడుగుల భజనలు, భక్తి సంకీర్తనలు, కోలాటాలతో స్వాములు శోభాయాత్రకు వన్నె తెచ్చారు. పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. శోభయాత్ర కొనసాగుతున్న దారిలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. యాత్ర అయ్యప్ప కొండకు చేరుకున్నాక అయ్యప్ప స్వామికి క్షీరాభిషేకం చేశారు. యాత్రలో పలు రాజకీయ పార్టీల నాయకులతో పాటు హిందూ ధార్మిక సంఘాలు, వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
రక్తదానం చేసిన స్వాములు
మహబూబ్‌నగర్ వైద్యవిభాగం, (ఆంధ్రజ్యోతి) : మహా పడిపూజను పురస్కరించుకొని సేవా సమాజం ఆధ్వర్యంలో అయ్యప్పకొండపై మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎస్పీ డీ జానకి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రక్తదానం చేసేందుకు ప్రతీ ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం స్వాములు, భక్తులు రక్తదానం చేశారు. అందులో జనరల్ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకుకు 170 యూనిట్లు, రెడ్‌క్రాస్‌కు 320 యూనిట్ల రక్తాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, అయ్యప్ప సేవా సమాజం అధ్యక్షుడు భగవంతరావు, కార్యదర్శి ముత్యం స్వామి, కోశాధికారి చంద్రశేఖర్ యాదవ్, నిర్వాహకులు పంబరాజు స్వామి, నారాయణ, బ్లడ్ బ్యాంకు వైద్యాధికారి డాక్టర్ శ్రీకర్, రెడ్‌క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్, బ్లడ్ బ్యాంకు ఇన్‌చార్జి మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.