నిండా ముంచుతున్న లూజు విత్తనాలు
ABN , Publish Date - Jun 24 , 2025 | 11:31 PM
లూజు పత్తి విత్తనాలు రైతులను నిండా ముంచుతున్నాయి.
- ఫెయిలైన పత్తి విత్తనాలకు రంగు పులిమి మోసం
- నమ్మించి రైతులకు అంటగడుతున్న ఆర్గనైజర్లు
- కిలోకు రూ.800 నుంచి రూ. 1000 వసూలు
- ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోని కంపెనీలు
అయిజ, జూన్ 24 (ఆంధ్రజ్యోతి) : లూజు పత్తి విత్తనాలు రైతులను నిండా ముంచుతున్నాయి. కొందరు ఆర్గనైజర్లు జీవోటీ (గ్రో అవుట్ టెస్ట్)లో విఫలమైన పత్తి విత్తనాలకు రంగు పులుమి గ్రామీణ ప్రాంతాల రైతులకు అంటగడుతున్నారు. వాటిని సాగు చేసిన రైతులు విత్తనాలు మొలకెత్తక, మొలకెత్తినా దిగుబడి రాక నష్టపోతున్నారు. గ్రో అవుట్ టెస్టులో విఫలమైన పత్తి విత్తనాలను ఆయా కంపనీలు రైతుల సమక్షంలోనే నలగ్గొట్టి (క్రష్షింగ్) వారికే ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. 2020 నుంచి 2024 సంవత్సరం వరకు 5 సీడ్ కంపెనీలు 3,613 క్వింటాళ్ళ పత్తి విత్తనాలు పరీక్షలో విఫలమైనట్లు కమిషన్‌కు నివేదిక ఇచ్చినట్లు వ్యవసాయాధికారులు చెప్తున్నారు. దీంతో వాటిని ధ్వంసం చేయడానికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ మిగతా కంపెనీల నుంచి విఫలమైన విత్తనాల సమాచారం అందలేదు. ఆ విత్తనాలు ఎక్కడికి పోయినట్లన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒప్పంద పద్ధతిలో విత్తనపత్తి సాగు
జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ, దరూర్, గట్టు, వడ్డేపల్లి, అలంపూర్, ఇటిక్యాల మండలాల్లో ఎక్కువ మంది రైతులు సీడ్ పత్తిని సాగు చేస్తారు. ప్రతీ సంవత్సరం కంపెనీలు రైతులకు ఒప్పంద పద్ధతిలో ఫౌండేషన్ విత్తనాలు ఇచ్చి మధ్యవర్తుల ద్వారా రైతులకు ఇచ్చి సీడ్ పత్తి సాగు చేయిస్తున్నాయి. ఇలాంటివి ప్రధాన కంపనీలతో పాటు చిన్నా చితక కలిపి దాదాపు 20కి పైగానే ఉన్నట్లు సమాచారం. ఇవి మధ్యవర్తులుగా ఉన్న సీడ్ ఆర్గనైజర్ల ద్వారా పత్తి విత్తనాలను సేకరిస్తుంటాయి. రైతులు పండించిన పత్తి విత్తనాలలో జీవోటీలో ప్రతీ సంవత్సరం 5 శాతానికి పైగానే విఫలం అవుతుం టాయి. గత సంవత్సరం 10 శాతం వరకు వరకు విత్తనాలు విఫలం అయినట్లు సమాచారం. వాటిని ధ్వంసం చేసి రైతులకు ఇవ్వాలని ఆదేశాలున్నప్పటికీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు.
దిగుబడి రాక నష్టపోతున్న రైతులు
ఫెయిల్ (విఫలం) అయిన పత్తి విత్తనాలు కంపెనీలు తమ వద్ద ఉంచుకోవటమో, సీడ్ ఆర్గనైజర్లకు అందించడమో జరుగుతుంది. అక్కడి నుంచే నకిలీ మార్కెటింగ్ ప్రారంభం అవుతుంది. విఫలమైన లూజు పత్తి విత్తనాలకు రంగు పులిమి, ఆకర్షణీయమైన కవర్లలో ప్యాక్ చేసి ఇతర ప్రాంతాలకు తరలించి రైతులకు అంటగడుతున్నారు. కొందరు సీడ్ ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్లు తమ బంధువులు, గుమాస్తాలు ఇళ్లలో నిల్వ చేసుకొని రైతులకు కిలోల చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. నాణ్యమైన పత్తి విత్తనాలు మార్కెట్‌లో 475 గ్రాముల ప్యాకెట్‌కు రూ. 900 వరకు ధర ఉంటోంది. లూజు విత్తనాలను కిలోకు రూ.800 నుంచి రూ.1000 వరకు స్థానికంగా విక్రయిస్తున్నారు. ఆ విత్తనాలను సాగు చేసిన రైతులు దిగుబడి రాక నష్టపోతున్నారు. వ్యవసాయ శాఖ టాస్క్‌ఫోర్స్ అధికారులు చేసిన దాడుల్లో లూజు, నకిలీ పత్తి విత్తనాలు బయట పడుతున్నాయి. రెండు సంవత్సరాల క్రితం శాంతినగర్ లోని ఓ గోదాంలో నాసిరకం విత్తనాలు పెద్ద మొత్తం లో బయటపడ్డాయి. ఈ నెల 17న అయిజ మండలం లోని కేశవరం గ్రామంలో రూ. 1,80,000 విలువైన 4 సంచుల లూజు పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి.
ఆకస్మిక దాడులు చేస్తున్నాం
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్ టీములు పని చేస్తున్నాయి. విస్తుృతంగా దాడులు చేసి లూజు, నాసిరకం పత్తి విత్తనాలను పట్టుకుంటు న్నాయి. నకిలీ విత్తన పత్తి సీడ్స్‌ను అమ్మినా, నిల్వ చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అనుమానిత వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నాం.
సక్రియానాయక్, జిల్లా వ్యవసాయశాఖాధికారి, గద్వాల