మత్తుతో జీవితాలు ఛిద్రం
ABN , Publish Date - Jun 25 , 2025 | 11:36 PM
మత్తుకు బానిసలుగా మారి ఎంతో మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
- పెరుగుతున్న గంజాయి వినియోగం
- యువతరం భవిష్యత్తు అంధకారం
మహబూబ్‌నగర్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి) : మత్తుకు బానిసలుగా మారి ఎంతో మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. వాటికి అలవాటి పడిన వారు తమ శరీరంపై నియంత్రణ, చేసే పనిపై ఏకాగ్రతను కోల్పోతున్నారు. అనారోగ్యం భారిన పడి ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు దూరం అవుతున్నారు. ఈ నేపథ్యంలో మత్తు పదార్థాల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. నేడు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..
సమాజానికి తీరని నష్టం
ప్రధానంగా యువత మాదక ద్రవాలకు అలవాటు పడటం వల్ల వారి కుటుంబంతో పాటు సమాజానికి తీరని నష్టం వాటిల్లుతోంది. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి చేస్తోంది. అయినా ఎంతో మంది యువతీ, యువకులు చెడు వ్యసనాలకు లోనవడం ఆందోళనకు గురిచేస్తోంది. అలాగే మాదక ద్రవ్యాల వినియోగంతో నేరాల సంఖ్య పెరుగుతున్నట్లు పోలీసు శాఖ గుర్తించింది. వాటి వినియోగంతో కలిగే అనర్ధాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
గంజాయి బారిన పడ్తున్న యువత
మాదక ద్రవ్యాల్లో నేచురల్ డ్రగ్, సింథటిక్ డ్రగ్ అనే రెండు రకాలున్నాయి. నేచురల్ డ్రగ్స్‌లో గంజాయి, హాష్ ఆయిల్, గంజా చాకొలెట్ వంటివి ఉన్నాయి. సింథటిక్ డ్రగ్స్‌లో అల్ర్ఫాజోలం, కొకైన్ హెరైన్, మత్తు టాబ్లెట్లు వంటివి వస్తాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో నేచురల్ డ్రగ్ అయిన గంజాయి వినియోగం పెరుగుతోంది. సింథటిక్ డ్రగ్స్‌లో ఒకటైన ఆల్ఫజోలంను కల్లు తయారీలో వినియోగిస్తున్నారు. కొకైన్, హెరైన్, మత్తు టాబ్లెట్ల వంటి వాటి వినియోగం జిల్లాలో తక్కువగానే ఉంది.
ఎక్కువవుతున్న కేసులు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో గంజాయి విక్రయాలు, వినియోగం రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరుతో పాటు గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో గంజాయి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లోని దూల్‌పేట నుంచి కొందరు యువకులు రైళ్ళలో గంజాయిని తీసుకొస్తున్నారు. తాము తాగడంతో పాటు, అలవాటున్న వారికి 5 గ్రాముల ప్యాకెట్‌లను రూ.300 - 500 వరకు విక్రయిస్తున్నారు. కొత్త వారిని కూడా ప్రలోభ పెట్టి అలవాటు చేస్తున్నారు. అక్కడక్కడ కొందరు గంజాయి మొక్కలను పెంచుతున్నా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు కట్టడి చేస్తోంది. గతేడాది అక్టోబరులో జిల్లా కేంద్రంలోని పిస్తాహౌస్ దగ్గర రూ.25 లక్షల విలువ చేసే 5 కిలోల హాష్ ఆయిల్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులు ఒరిస్సా మీదుగా రాయిచూర్‌కు హాష్ ఆయిల్‌ను తరలిస్తుండగా స్టేట్ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ బృందాలు పట్టుకున్నాయి. గత నెలలో జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, 650 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గతేడాది ఇదే జిల్లాలోని ఉండవల్లిలో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు వ్యక్తులు గంజాయిని విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
అల్ర్ఫాజోలంతో కృత్రిమ కల్లు
కల్లును ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కువగా కృత్రిమంగా తయారు చేస్తున్నారు. ఈత వనాలు తగ్గిపోవడం, గీత కార్మికులలో పాతతరం వారు వృత్తిని మానేయడం, కొత్తవాళ్ళు రాకపోవడంతో సహజ మైన కల్లు ఉత్పత్తి తగ్గిపోతోంది. దీంతో చాలా చోట్ల డిపోలలోనే కృత్రిమంగా డైజోఫాం, అల్ర్ఫాజోలం వంటి మత్తు పదార్తాలు కలిపి కల్తీకల్లును తయారు చేస్తున్నారు. ఈ కల్లుకు అలవాటు పడ్డ వారు బానిసలుగా మారుతున్నారు. ఉన్నట్లుండి అల్ర్ఫాజోలం కల్లు లభించకపోతే పిచ్చి వారిలాగా ప్రవర్తిస్తున్నారు. వారిని ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందించాల్సి వస్తోంది. గతంలో అల్ర్ఫాజోలం వినియోగం అధికంగా ఉండేది. ప్రస్తుతం దాని ధర కిలోకు రూ.10 లక్షల వరకు ఉండటంతో తక్కువ మోతాదులోనే వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.
నిర్మూలన అందరి బాధ్యత
మాదకద్రవ్యాల వినయోగం సమాజాన్ని మానసికంగా, ఆర్థికంగా నాశనం చేస్తుంది. మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యత. డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం అందరూ కృషి చేయాలి. దీనిపై ప్రజలు, యువత, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గంజాయి విక్రయాల కట్టడికి మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం. యువత గంజాయి, డ్రగ్స్ బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. మాదకద్రవ్యాల వినియోగం, రవాణా చేస్తున్న సమాచారం తెలిస్తే డయల్ 100, 1908 టోల్‌ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలి.
- జానకి, ఎస్పీ