Share News

చాపకింద నీరులా.. విస్తరిస్తున్న హెచ్‌ఐవీ...

ABN , Publish Date - Jul 11 , 2025 | 11:48 PM

ఆర్థిక స్థోమత లేక కొందరు... అవగాహన లేక మరికొందరు... లైంగిక సంబంధాల ద్వారా ఇంకొందరు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో కారణంతో ఏయిడ్స్‌ వ్యాధి బారిన పడుతున్నారు.

 చాపకింద నీరులా..   విస్తరిస్తున్న హెచ్‌ఐవీ...

- ఉమ్మడి జిల్లాలో 10,095 మంది హెచ్‌ఐవీ బాధితులు

- రోజు రోజుకు పెరుగుతున్న కేసులు

- సురక్షితం కాని లైంగిక సంబంధాలే ప్రధాన కారణం

- అవగాహన కల్పించడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫలం

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం), జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక స్థోమత లేక కొందరు... అవగాహన లేక మరికొందరు... లైంగిక సంబంధాల ద్వారా ఇంకొందరు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో కారణంతో ఏయిడ్స్‌ వ్యాధి బారిన పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 2007 నుంచి ఇప్పటి వరకు గణాంకాలు చూస్తే 10,095 మంది హెచ్‌ఐవీ బాధితులు ఉన్నారు. అయితే ఈ వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తుండగా, రోజు రోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అదే స్థాయిలో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ వ్యాధి ప్రధానంగా సురక్షితం కాని లైంగిక సంబంధాలే ఇందుకు మూలకారణంగా నిలుస్తోంది. కానీ ప్రభుత్వం వ్యాధి నియంత్రణ, నిర్మూలన కోసం దృష్టి పెట్టడం లేదు. అందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతోంది. దీంతో వ్యాధి సోకిన వ్యక్తులు చనిపోవాల్సిన దుస్థితి ఎదురైంది.

10,095 మంది బాధితులు...

ఉమ్మడి జిల్లాలో హెచ్‌ఐవీ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. 2007 నుంచి ఇప్పటి వరకు 10,095 మంది హెచ్‌ఐవీ బాధితులు ఉన్నారు. అందులో జిల్లాలోని ఆయా మండలాలు, జాతీయ రహదారికి పక్కన ఉన్న మండలాల్లో ఇది ఎక్కువగా ఉంది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఈ వ్యాధి ప్రస్తుతం పట్టణ ప్రాంతాలకు వేగంగా వ్యాపిస్తోంది. ప్రధానంగా మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లోనే ఎక్కువగా విస్తరిస్తోంది. గత ఏడాది 2024 డిసెంబర్‌ వరకు 1324 కేసులు ఉండగా, ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు 6 నెలల్లో 223 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం.

లైంగిక సంబంధాలే ప్రధాన కారణం...

హెచ్‌ఐవీ వ్యాధి సోకేందుకు ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో లైంగిక సంబంధాలే ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో వలసలు వెళుతుండటం, అక్కడి నుంచి ఈ లైంగిక సంబంధాల ద్వారా జిల్లాకు అంటగడుతున్నారు. ఫలితంగా ఆయా జిల్లాలో దాని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. గతంలో పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఈ వ్యాధి నేడు గ్రామీణ ప్రాంతాలను సైతం కుదిపేస్తున్నది. ఎక్కువ శాతం పట్టణ యువకుల్లో ఈ వ్యాధిని గుర్తిస్తున్నారు. రక్తమార్పిడి వలన 5 శాతం నిర్ధారణ అవుతుండగా, మిగతా 95 శాతం సురక్షితం కాని లైంగిక సంబంధాల ద్వారా హెచ్‌ఐవీ బాధితులు పెరుగుతున్నారు. అదేవిధంగా జాతీయ రహదారికి దగ్గరలో ఉన్న మండలాల్లో కూడా ఇది అధికంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, సెక్స్‌ వర్కర్లు, మగవారితో సంభోగం జరిపేవారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతున్నది. సెక్స్‌ వర్కర్లు దాదాపు 5వేల మంది ఉన్నట్లు తెలుస్తోంది.

చనిపోయే వారు కూడా ఎక్కువే...

ఉమ్మడి జిల్లాలో హెచ్‌ఐవీతో చనిపోయే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. మందులు సరిగ్గా వాడకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో 2007 నుంచి ఇప్పటి వరకు 6,472 మంది చనిపోయారు. అవగాహన లోపం, సురక్షితం కాని లైంగిక సంబంధాలు కొనసాగించడం, మందులు సరిగ్గా వాడకపోవడం వల్లనే ఈ మరణాలు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో దాదాపు 8వేల మంది వరకు హెచ్‌ఐవీ బాధితులు ఏఆర్‌టీ మందులు వాడుతుండగా, మిగతా 2వేల మంది వరకు మందులు వాడటం లేదని అధికారులు భావిస్తున్నారు. వీరంతా సమాజానికి భయపడి వ్యాధిని నిర్ధారణ చేసుకోవడం లేదు. అంతేకాకుండా వ్యాధి ఉన్నప్పటికీ మందులు వాడకపోవడం, నిర్లక్ష్యం చేయడం వలన ప్రాణాలు కోల్పోతున్నారు.వాస్తవానికి సరైన సమయంలో ఏఆర్‌టీ మందులు వినియోగించడం వలన ఒక సాధారణ మనిషిలాగే జీవించవచ్చు. కానీ దానిపై అవగాహన లేకపోవడం, సమాజానికి భయపడి పరీక్షలు చేయించుకోకపోవడం వలన లోలోపలే కుమిలిపోయి అనారోగ్యం బారిన పడి చనిపోతున్నారు.

హెచ్‌ఐవీ నియంత్రణపై దృష్టి ఏది?

హెచ్‌ఐవీ వ్యాధి నిర్మూలన, నియంత్రణ కోసం ప్రభుత్వం ఏమాత్రం దృష్టి సారించడం లేదు. గత రెండేళ్లుగా టీఎస్‌ సాక్స్‌ నుంచి ఎలాంటి బడ్జెట్‌ విడుదల కావడం లేదు. ప్రధానంగా ఏఆర్‌టీ కేంద్రాల్లో హెచ్‌ఐవీని గుర్తించే పరీక్షలు చేయడానికి అవసరమయ్యే కిట్లు అందుబాటులో లేవు. కనీసం సూది, దూదికి కూడా దిక్కులేని దుస్థితి నెలకొంది. అంతేకాకుండా 5 జిల్లాలకు కలిపి ఒక్కటే ఏఆర్‌టీ సెంటర్‌ ఉంది. అందులో కూడా సిబ్బంది కొరత కారణంగా అందరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చే పరిస్థితి లేదు. ప్రతీ రోజు 200 నుంచి 300 మంది వరకు బాధితులు ఏఆర్‌టీ సెంటర్‌కు వస్తున్నారు. ఇదిలా ఉండగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో హెచ్‌ఐవీపై కళాజాతా ద్వారాగానీ, పోస్టర్లు, కరపత్రాల ద్వారాగానీ అవగాహన కల్పించడం లేదు. అందుకు అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వం మంజూరు చేయడం లేదు. దీంతో ఆయా జిల్లాల అధికారులు అవగాహన కార్యక్రమాలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు.

జిల్లా పేరు హెచ్‌ఐవీ బాధితులు చనిపోయినవారు మందులు

వాడనివారు

---------------------------------------------------------------------------------------

మహబూబ్‌నగర్‌ 3,020 2,154 126

జోగుళాంబ గద్వాల 1282 690 407

నాగర్‌కర్నూల్‌ 2,291 1314 379

నారాయణపేట 1780 1280 279

వనపర్తి 1722 1034 124

--------------------------------------------------------------------------------------

మొత్తం 10,095 6,472 1315

--------------------------------------------------------------------------------------

Updated Date - Jul 11 , 2025 | 11:48 PM