Share News

నల్లమలను చూసొద్దాం

ABN , Publish Date - Nov 13 , 2025 | 11:32 PM

నల్లమల అటవీ ప్రాంతం సహజసిద్ధమైన అందాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, జలపాతాలకు పెట్టింది పేరు.

నల్లమలను చూసొద్దాం
నల్లమలలో సాగుతున్న టైగర్‌ సఫారీ టూర్‌

- టైగర్‌ సఫారీపై పెరుగుతున్న క్రేజ్‌

- ఏటా పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య

- విదేశాల నుంచి కూడా వస్తున్న సందర్శకులు

- అటవీశాఖకు పెరుగుతున్న ఆదాయం

నాగర్‌కర్నూల్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : నల్లమల అటవీ ప్రాంతం సహజసిద్ధమైన అందాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, జలపాతాలకు పెట్టింది పేరు. వందల సంవత్సరాల ఆదిమజాతికి ఈ ప్రాంతం పుట్టినిల్లు. విప్లవ ఉద్యమాల ప్రభావం, అటవీ శాఖ తీవ్రమైన ఆంక్షల నేపథ్యంలో కుంటుపడిన పర్యాటక రంగం తిరిగి పుంజుకుంటోంది. అటవీశాఖకు ఆదాయం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరిగాయి.

20 వేల మంది పర్యాటకులు

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో దాదాపు 2.75లక్షల హెక్టార్లలో విస్తరించిన నల్లమల అటవీ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అటవీ పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వన్యప్రాణుల సంఖ్య పెరుగుతోంది. టైగర్‌ సఫారీని 2020-21లో 5,321 మంది సందర్శించగా, అటవీ శాఖకు రూ. 9.12 లక్షల ఆదాయం సమకూరింది. 2021-22లో 1,362 సఫారీ ట్రిప్పుల్లో 9,534 మంది పర్యాటకులు నల్లమల అందాలను వీక్షించారు. తద్వారా రూ. 1.14లక్షల ఆదాయం వచ్చింది. 2022-2023లో 1,362 మంది పర్యాటకులు నల్లమలలో పర్యటించగా, రూ. 2.72 లక్షలు, 2023-24లో రూ. 6.38 లక్షలు, 2024-25లో 20,195 మంది పర్యటించగా, రూ. 7.21 లక్షల ఆదాయం సమకూరింది. నల్లమల అటవీ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులు ఇతర రాష్ట్రాల వారినే కాకుండా విదేశీయులను కూడా ఆకర్షిస్తోంది. గత ఏడాది దాదాపు 22 మంది స్విట్జర్లాండ్‌, న్యూజిలాండ్‌కు చెందిన వారు, అమెరికాలో నివసించే ప్రవాస భారతీయులు కూడా నల్లమలను సందర్శించారు. దాదాపు 80 కిలోమీటర్ల దూరం అడవిలో ప్రయాణించి ఆనందించారు. అలాగే ఉమామహేశ్వరం, లొద్దిమల్లయ్య, బౌరాపురం, మల్లెలతీర్థం తదితర పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తుండటంతో ఆదాయం క్రమంగా పెరుగుతోంది.

ప్యాకేజీని బట్టి చార్జీ

నల్లమల సఫారీ టూర్‌కు ఏప్రిల్‌ నుంచి జూన్‌, అక్టోబరు నుంచి మార్చి నెలల్లో అవకాశం ఉంటుంది. జూలై నుంచి సెప్టెంబరు వరకు టూర్‌ను నిలిపివేస్తారు. జంగల్‌ సఫారీలో భాగంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాగే ఈ ట్రిప్‌కు పర్యాటకుల నుంచి ప్యాకేజీని బట్టి చార్జీ చేస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా ప్యాకేజీ బుక్‌ చేసుకుంటే రెండు రోజుల పర్యటన ఉంటుంది. మొదటి రోజు మన్ననూరు నుంచి ప్రారంభమై నల్లమల అడవిలో పర్యటన ఉంటుంది. రెండో రోజు ట్రెక్కింగ్‌ ఉంటుంది. రూ. 6 వేల నుంచి రూ. 9 వేల వరకు ప్యాకేజీలు ఉంటాయి. ఆఫ్‌లైన్‌ ద్వారా అయితే ఓ గంట సమయంలో పర్హాబాద్‌ చౌరస్తా నుంచి వ్యూ పాయింట్‌ వరకు తీసుకువెళ్లి చూపిస్తారు. ఆఫ్‌లైన్‌ వారికి రూ. 3 వేలు నుంచి రూ. 5 వేల వరకు ప్యాకేజీలు ఉంటాయి.

Updated Date - Nov 13 , 2025 | 11:32 PM