ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం
ABN , Publish Date - May 29 , 2025 | 11:04 PM
ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందామని, ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలని టీఎస్‌యూటీఎఫ్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పిలుపునిచ్చారు.
- టీఎస్‌యూటీఎఫ్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం/జడ్చర్ల, మే 29 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందామని, ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలని టీఎస్‌యూటీఎఫ్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. పౌరస్పందన వేదిక, తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదుకై నిర్వహిస్తున్న ప్రచార జాతాలో భాగంగా గురువారం జడ్చర్ల నేతాజీచౌరస్తా, మహబూబ్‌నగర్ క్లాక్ టవర్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రజలే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన బోధనతో పాటు అనుభవజ్ఞులు, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాంలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, వారంలో మూడురోజులు గడ్లు, రాగిజావా అందిస్తున్నారని గుర్తు చేశారు. ప్రతీ నెల పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌తో విద్యార్థుల చదువుపై చర్చించే అవకాశం సైతం కల్పించారని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. ప్రైవేట్ విద్యాలయాలు వ్యాపార కార్యాలయాలుగా మారాయన్నారు. ప్రైవేట్ పాఠశాలలు వద్దు ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అన్న నినాదంతో ముందుకు సాగుదామన్నారు. ప్రభుత్వ బడి మూత పడితే సమాజనికి నష్టం అన్నారు. ఆయా కార్యక్రమాల్లో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్, కార్యదర్శి అజయ్, హేమంత్, నాయకులు శంకర్, హనుమంతు, రాములు, చిన్నయ్య, శ్రీనివాస్ ఆర్య, కురుమయ్య, వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేఏ మంగ, కమిటీ సభ్యులు నాగమణి, కావ్య, ధనమూర్తి, పెన్షనర్ సంఘం జిల్లా అధ్యక్షుడు రామదాసు, కార్యదర్శి నరసిహులు, మన్యం, కృష్ణ, వెంకటయ్య, రమేశ్, నరేశ్, మల్లస్వామి, నజీర్ పాల్గొన్నారు.