Share News

అవసరం కన్నా..తక్కువే!

ABN , Publish Date - Jul 07 , 2025 | 11:18 PM

: ఉమ్మడి జిల్లాలో సాగు పనులు జోరందుకున్నాయి. తొలకరిగా కురిసిన వర్షాలకు వేసిన పంటలకు సంబంధించి కలుపుతీత పనులు కూడా ప్రారంభమయ్యాయి. వానాకాలంలో ఎక్కువగా సాగుచేసే ఆరుతడి పంటలకు ఎరువుల వాడకం కొంత వరకు పూర్తయినప్పటికీ ఇప్పుడిప్పుడే వరి తుకాలు చేతికి వచ్చే దశలో ఉన్నాయి.

అవసరం కన్నా..తక్కువే!
వనపర్తి జిల్లా ఖిల్లాగణపూర్‌ మండల కేంద్రంలోని ఆగ్రోస్‌ కేంద్రంలో అందుబాటులో ఉన్న ఎరువులు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో అందుబాటులో ఉన్న ఎరువుల నిల్వలు

ఆగస్టు వరకు సాగుకు సరిపోతాయని అంటున్న వ్యవసాయ అధికారులు

ఇప్పటికే యూరియా విషయంలో ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి తుమ్మల

యూరియా, డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులు సీజన్‌ అవసరం కంటే తక్కువే నిల్వ

కొరత రాకముందే పూర్తి స్థాయి నిల్వలు అందుబాటులో ఉంచాల్సిన అవసరం

మహబూబ్‌నగర్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో సాగు పనులు జోరందుకున్నాయి. తొలకరిగా కురిసిన వర్షాలకు వేసిన పంటలకు సంబంధించి కలుపుతీత పనులు కూడా ప్రారంభమయ్యాయి. వానాకాలంలో ఎక్కువగా సాగుచేసే ఆరుతడి పంటలకు ఎరువుల వాడకం కొంత వరకు పూర్తయినప్పటికీ ఇప్పుడిప్పుడే వరి తుకాలు చేతికి వచ్చే దశలో ఉన్నాయి. ప్రాజెక్టులకు కూడా వరద పెరుగుతుండటంతో ఆయకట్టు పరిధిలోని కాలువలకు నీటి విడుదల ప్రారంభమైంది. ఈ వారం నుంచి వరినాట్లు కూడా ప్రారంభం కానున్నాయి. ప్రతీఏటా సీజన్‌ ప్రారంభం కంటే ముందే సాగు అంచనాలను సిద్ధం చేసుకొని వ్యవసాయ అధికారులు అందుకు తగ్గట్టుగా ఎరువుల నిల్వలను అందుబాటులో ఉంచుకుంటారు. ప్రస్తుతానికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎరువుల కొరత లేదు. కావాల్సిన ఎరువులన్నీ అందుబాటులో ఉన్నాయి. ఆరుతడి పంటలకు ఎరువులను రైతులు కొంతమేర కొనుగోలు చేసి తీసుకెళ్లగా కలుపు తర్వాత, పూత వచ్చే సమయంలో వేసే ఎరువులను ఇంకా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ సీజన్‌ అవసరాలకు కావాల్సిన ఎరువుల కంటే తక్కువ నిల్వలు ఉండటం కొంత ఆందోళన కలిగిస్తోంది. వ్యవసాయ అధికారులు మాత్రం ఆగస్టు వరకు సాగు అవసరాలకు ఇప్పుడున్న ఎరువుల నిల్వలు సరిపోతాయని చెబుతున్నప్పటికీ నిల్వలు పెంచుకోకపోతే ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కూడా కచ్చితంగా ఉంటుంది. రాష్ట్రంలో మిగతా జిల్లాల కంటే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రస్తుతం ఉన్న నిల్వలు కొంత అధికంగా ఉన్నాయి. అయితే అప్రమత్తంగా ఉండకపోతే రైతులకు ఎక్కువ ఎరువులు అవసరమయ్యే సమయానికి కొరత ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

యూరియానే ప్రధానం

ఉమ్మడి జిల్లాలో రైతులు వాడుతున్న ఎరువుల్లో యూరియానే ప్రధానమైంది. అయితే ఈ ఏడాది అనుకున్నట్లుగా కేంద్రం నుంచి యూరియా వ్యాగన్లు సరిపడా రాలేదని పలుమార్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రం రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని కోరారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రస్తుత సీజన్‌ పూర్తయ్యే సరికి 1.40 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం రైతులకు ఉంటుంది. కానీ ప్రస్తుతం 44,569 మెట్రిక్‌ టన్నుల యూరియా మాత్రమే అందుబాటులో ఉన్నది. ఇప్పటికే కొంతమేర యూరియా రైతులు కొనుగోలు చేయడమో లేక వాడటమో జరగ్గా ఇంకా సుమారు 70 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలకు అవసరమవుతోందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇక మరో ప్రధానమైన డీఏపీ విషయానికి వస్తే ఉమ్మడి జిల్లాలో 42,188 మెట్రిక్‌ టన్నులు సీజన్‌ పూర్తయ్యే నాటికి అవసరం. కానీ ప్రస్తుతం 16,504 మెట్రిక్‌ టన్నుల డీఏపీ ఎరువులు ఉమ్మడి జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. ఇంకా 25 వేల మెట్రిక్‌ టన్నుల డీఏపీ అవసరం ఉంది. ఈ రెండు ఎరువులు రైతులు ఎక్కువగా వాడతారు. అవసరానికి తగ్గట్టుగా ఇండెంట్‌ పెట్టి ఎరువులు తెచ్చుకుంటే తప్పా రైతులకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. వ్యవసాయ అధికారులు మాత్రం వాడకం జరుగుతున్నా కొద్దీ ఇండెంట్‌ తెప్పించుకుంటామని చెబుతున్నారు.

మిగతా ఎరువులదీ అదే పరిస్థితి

యూరియా, డీఏపీతో పాటు రైతుల సాగు అవసరాలకు కాంప్లెక్స్‌, ఎంఏపీ ఎరువులు కూడా కీలకమే. ఈ నిల్వలు కూడా సీజన్‌ అవసరాల కంటే ఉమ్మడి జిల్లాలో తక్కువగా ఉన్నాయి. ఏంఏపీ ఎరువులు 18,299 మెట్రిక్‌ టన్నులు ఉమ్మడి జిల్లాలో అవసరం ఉండగా.. ప్రస్తుతం 2655 మెట్రిక్‌ టన్నులు మాత్రమే వివిధ గోదాములు, సింగిల్‌ విండోలు, ప్రైవేటు డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయి. ఇంకా 15,644 మెట్రిక్‌ టన్నుల ఎంఏపీ ఎరువులను ఇండెంట్‌ పెట్టి తెప్పించుకోవాల్సి ఉంది. ఇక మరోప్రధానమైన కాంప్లెక్స్‌ ఎరువులను తీసుకుంటే 1.66 లక్షల మెట్రిక్‌ టన్నులు అవసరం ఉంది. ఇందులో 44,841 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. సీజన్‌కు అవసరం ఉన్న ఎరువుల్లో కొంతమేర వినియోగించగా ఇంకా లక్ష మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులను నిల్వ చేసుకోవాల్సి ఉంది. ఎంఏపీ ఎరువులు ఉమ్మడి పాలమూరులోని అన్ని జిల్లాల్లో అతితక్కువ నిల్వలు ఉండగా కాంప్లెక్స్‌ ఎరువులు నాగర్‌కర్నూలు, వనపర్తి జిల్లాలో తక్కువగా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌కర్నూలు జిల్లాల్లో యూరియా తక్కువ నిల్వలు ఉన్నాయి. అయితే సీజన్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ నిల్వలను అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Jul 07 , 2025 | 11:18 PM