పేరపళ్ల అటవీ ప్రాంతంలో చిరుత మృతి
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:23 PM
నారాయణపేట మండలంలో పేరపళ్ల గ్రామ గుట్టల ప్రాంతంలో ఓ చిరుత మృతి చెందింది.
- నాలుగు రోజుల క్రితం చిరుత మృతదేహం గుర్తింపు
- ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు
- పోస్టుమార్టం కోసం తరలింపు
నారాయణపేట, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట మండలంలో పేరపళ్ల గ్రామ గుట్టల ప్రాంతంలో ఓ చిరుత మృతి చెందింది. నాలుగు రోజుల క్రితం మృతి చెందిన చిరుత పులి దుర్వాసన రావడంతో ఓ పశువుల కాపరి అటవీ శాఖ బీట్ అధికారి సంతోష్‌కు శనివారం సమాచారం ఫోన్ ద్వారా అందించారు. చిరుతపులి మృతి చెందిన విషయం తెలుసుకున్న గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. దాంతో అటవీశాఖ రేంజ్ అసిస్టెంట్ అధికారి కమాలొద్దీన్‌తో పాటు బీట్ అధికారి పేరపళ్ల గుట్టల ప్రాంతం చెట్ల మధ్య మృతి చెందిన చిరుత మృతదేహాన్ని పరిశీలించారు. అయితే, చిరుతకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పాటు గోర్లు, కళ్లు, దంతాలు ఉండడంతో చిరుత నాలుగేళ్ల వయస్సు ఉంటుందని, అనారోగ్యంతో మృతి చెంది ఉండవచ్చని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. చిరుత మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ కార్యాలయ పరిసరాల్లోకి తరలించి పశువైద్యుడు అనిరుధ్ పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అటవీ శాఖ సిబ్బంది కాల్చివేశారు.