ఈ ఏడాది నుంచే లా, ఇంజనీరింగ్ కోర్సులు
ABN , Publish Date - May 21 , 2025 | 10:57 PM
పాలమూరు యూనివర్సిటీలో లా, ఇంజనీరింగ్ కోర్సులు ఈ ఏడాదే ప్రారంభం కానున్నాయి.

- పీయూలో ప్రారంభానికి చురుగ్గా ఏర్పాట్లు
- వసతి గృహాల ఏర్పాటుకు చర్యలు
పాలమూరు యూనివర్సిటీ, మే 21 (ఆంధ్రజ్యోతి) : పాలమూరు యూనివర్సిటీలో లా, ఇంజనీరింగ్ కోర్సులు ఈ ఏడాదే ప్రారంభం కానున్నాయి. అందుకు అవసరమైన ఏర్పాట్లకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పాలమూరు జిల్లాలో ఉన్నత విద్యావకాశాలు కల్పించడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అందుకు అనుగుణంగా పాలమూరు యూనివర్సిటీలో 2025-26 విద్యాసంవత్సరం నుంచే లా, ఇంజనీరింగ్ కోర్సులను ప్రారంభించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి, పీయూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. లా, ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇప్పటికే రూ.వంద కోట్లు మంజూరయ్యాయి. అయితే ప్రస్తుతం కళాశాలలకు అవసరమైన శాశ్వత భవనాల నిర్మాణానికి సమయం పట్టనుండటంతో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు పీయూ అధికారులు చెప్తున్నారు.
ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
లా కళాశాలలో 3 సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రతీ ఏడాది 60 ప్లస్ 60, మొత్తం 120 సీట్లు, ఎల్‌ఎల్‌ఎంలో ఐపీఆర్ (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్) 30 సీట్లు, అలాగూ ఇంజనీరింగ్ కోర్సులో అన్ని విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతానికి లా, ఇంజనీరింగ్ కోర్సులను ప్రారంభించేందుకు పీయూ అకాడమిక్ భవనంపై అదనపు తరగతి గదుల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. అలాగే విద్యార్థినులకు వసతి గృహం కోసం మహబూబ్‌నగర్ రూరల్ తహసీల్దార్ కార్యాలయం పక్కనున్న దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ భవనాన్ని కలెక్టర్ అనుమతితో లీజుకు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. బాలుర వసతి గృహం కోసం పాలమూరు యూనివర్సిటీ ఎదురుగా ఉన్న రెడ్డి హస్టల్ భవనాన్ని అద్దెకు తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది కళాశాలల ఏర్పాటుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఆయా కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశానికి సంబంధించి సెట్‌లు నిర్వహించే యూనివర్సిటీల అనుమతి కూడా తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభం
ఈ విద్యా సంవత్సరం నుంచే లా, ఇంజనీరింగ్ కోర్సులను ప్రారంబించాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తాం. నూతన భవనాల నిర్మాణం ఆలస్యం కానుండటంతో తాత్కలిక ఏర్పాట్లు చేసేందుకు యత్నిస్తున్నాం. అలాగే వసతి గృహాల ఏర్పాటుకు అవసరమైన భవనాలను గుర్తించాం. వాటిని లీచుకు తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
- ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్, వైస్ చాన్సలర్, పీయూ