డీసీసీ సారథిగా కూచకుళ్ల రాజేశ్ రెడ్డి?
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:32 PM
నాగర్‌కర్నూల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డికి దక్కనున్నట్లు సమాచారం.
- వారంలోగా అధికారికంగా ప్రకటన
- మంత్రి, ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం
నాగర్‌కర్నూల్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డికి దక్కనున్నట్లు సమాచారం. ఈ విషయంపై మంత్రి జూపల్లి కృష్ణారావు సహా అచ్చంపేట, కల్వకుర్తి ఎమ్మెల్యేలు కూడా మద్దతు తెలిపినట్లు తెలిసింది. దీంతో వారం రోజుల్లో కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి పేరును ఖరారు చేస్తూ ఏఐసీసీ అధికారికమైన ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు విశ్వసనీయమైన సమాచారం. ఎంపీ మల్లురవి కూడా జిల్లా ఎమ్మెల్యేల అభిప్రాయం వైపు మొగ్గు చూపడంతో రాజేశ్‌రెడ్డికి డీసీసీ అధ్యక్ష పదవిని అప్పగిస్తూ ఏఐసీసీ చేయనున్న ప్రకటన లాంఛనప్రాయంగా మారింది.
పోటీలో 16 మంది నాయకులు
నాగర్‌కర్నూల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి 16 మంది పోటీలో ఉన్నప్పటికీ నిబంధనలను పక్కన పెట్టి ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి వైపే అధిష్ఠానం మొగు ్గచూపింది. పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి గత నెలలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ అంతర్గత సమావేశంలో జిల్లా అధ్యక్ష పదవికి దరఖాస్తులను స్వీకరించారు. దాదాపు పదేళ్లపాటు జిల్లా అధ్యక్ష పదవిని సమర్థవంతంగా చేపట్టిన చిక్కుడు వంశీకృష్ణ ఈ సారి బాధ్యతలు నిర్వర్తించేందుకు విముఖత కనబర్చారు. అచ్చంపేట ఎమ్మెల్యేగా ప్రజా క్షేత్రంలో ఉండాల్సిన నేపథ్యంలో తాను తిరిగి కొనసాగలేనని ఏఐసీసీ పరిశీలకుడు నారాయణస్వామికి నిస్పష్టంగా తెలియజేశారు. ఈ క్రమంలో జిల్లా పార్టీకి సారథ్యం వహించే అంశంలో అనేక తర్జనభర్జనలు జరిగాయి. నారాయణస్వామి నాగర్‌కర్నూల్‌కు వచ్చే ఒక రోజు ముందుగానే హైదరాబాద్‌లోని మంత్రి జూపల్లి కృష్ణారావు నివాసంలో సమావేశమైన జిల్లా ఎమ్మెల్యేలు, ప్రధాన నాయకులు, కూచకుళ్ల రాజేశ్‌రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే సముచితంగా ఉంటుందనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షీ నటరాజన్‌కు కూడా పూసగుచ్చినట్లు వివరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం నుంచి బీఆర్‌ఎస్ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది బలమైన నాయకుడుగా ఉన్న మర్రిజనార్దన్‌రెడ్డి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడుగా నియామకమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కూచకుళ్ల రాజేశ్‌రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి ప్రయోజనకరంగా ఉంటుందని అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కూచకుళ్ల దామోదర్‌రెడ్డి హుందాతనం, ఆయన కుమారుడు కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి యువ నాయకత్వం పార్టీ పురోభివృద్ధికి దోహదం చేస్తుందని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆశావహులకు మరో అవకాశం
నాగర్‌కర్నూల్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం 16 మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ, వారిలో ప్రధానంగా నలుగురికి ఇతరత్రా రాజకీయ అవకాశాలు కల్పిస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం భరోసా ఇచ్చినట్లు సమాచారం. జిల్లా మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మహమ్మద్ హబీబ్, బ్లాక్ కాంగ్రెస్ బిజినేపల్లి అధ్యక్షుడు సుహాసన్‌రెడ్డి, కల్వకుర్తికి చెందిన కాయితి విజయ్‌కుమార్‌రెడ్డి, కొల్లాపూర్‌లో బీసీ నాయకుడు రాములుయాదవ్‌కు నామినేటేడ్ పదవులు లేదా పార్టీపరంగా ఉన్నతమైన అవకాశాలు కల్పిస్తామని ఎంపీ మల్లు రవి, జూపల్లి కృష్ణారావులు కూడా భరోసా ఇచ్చినట్లు సమాచారం. దీనివల్ల డీసీసీ అధ్యక్ష పదవి వ్యవహారం సాఫీగా జరిగిపోనుందని కాంగ్రెస్‌లోని విశ్వసనీయమైన వర్గాలు పేర్కొంటున్నాయి.