కోస్గి, మద్దూర్ ఆస్పత్రులను అభివృద్ధి చేయాలి
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:25 PM
పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి, మద్దూర్ ఆస్పత్రులను ఏఐజీ కార్పొరేట్ ఆస్పత్రికి ధీటుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర వైద్యశాఖ కార్యదర్శి క్రిస్ట్రిన అన్నారు. కోస్గి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని, మద్దూర్ ఆస్పత్రిని ఆమె నారాయణపేట కలెక్టర్ సిక్తాపట్నాయక్‌తో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు.
సిబ్బంది, వసతుల కోసం ప్రణాళిక తయారు చేయండి
రాష్ట్ర వైద్యశాఖ కార్యదర్శి క్రిస్టిన
కోస్గి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి, మద్దూర్ ఆస్పత్రులను ఏఐజీ కార్పొరేట్ ఆస్పత్రికి ధీటుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర వైద్యశాఖ కార్యదర్శి క్రిస్ట్రిన అన్నారు. కోస్గి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని, మద్దూర్ ఆస్పత్రిని ఆమె నారాయణపేట కలెక్టర్ సిక్తాపట్నాయక్‌తో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. కోస్గి ఆస్పత్రిలో ఓపీ వివరాలు, సదుపాయాలు, ల్యాబ్స్, ఆపరేషన్ థియేటర్‌ను పరిశీలించారు. రోగులతో మాట్లాడారు. వసుతులు బాగున్నాయా?, వైద్యులు అందుబాటులో ఉంటున్నారా? అని అడిగారు. సీజన్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. టైఫాయిడ్, మలేరియా, డెంగీ కేసులు ఏగ్రామంలో ఎక్కువగా ఉన్నాయో గుర్తించి అక్కడ వైద్య క్యాంపు ఏర్పాటు చేయాలని వైద్యాధికారి జయచంద్రమోహన్‌కు సూచించారు. అనంతరం ఆస్పత్రిలో వైద్యశాఖ అధికారులు, కలెక్టర్‌తో సమావేశం అయ్యారు. ఆస్పత్రిని మాడల్‌గా తయారు చేయాలన్నారు. అందుకు కావాల్సిన సిబ్బందిని నియమించి, అన్నిరకాల వసతులు కల్పించేందుకు ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఏఐజీ వైద్యులు మాడల్స్‌ను కార్యదర్శికి చూపించారు. జనరిక్ స్టోర్, బ్లడ్ స్టోర్ సెంటర్ ఉండాలన్నారు. ఏఐజీ వైద్యులు నమూనాలు చూపుతున్న క్రమంలో నెట్ సరిగా రాకపోవడంతో ఐటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దాదాపు రూ.కోటీ 30 లక్షలతో సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు తయారు చేశారు. ఇక్కడ కల్పించే వసతులు, సదుపాయాలు మద్దూరు ఆస్పత్రిలోనూ కల్పించాలని చెప్పారు. కార్యక్రమంలో టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్, ఏడీఎంఈ డాక్టర్ వాణి, సీఐవో మంజునాథ్ నాయక్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఆస్పత్రి సూపరిండెంట్ అనుదీప్ పాల్గొన్నారు.
నివేదిక తయారు చేయండి
మద్దూర్ (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వైద్య శాఖ సెక్రటరీ క్రిస్టిన మద్దూర్ ప్రభుత్వ ఆస్పత్రిని కూడా కలెక్టర్ సిక్తాపట్నాయక్‌తో కలిసి తనిఖీ చేశారు. వార్డులను పరిశీలించి, రోగులతో మాట్లాడారు. సమస్యలను తెలుసుకున్నారు. సదుపాయాల కోసం నివేదిక తయారు చేయాలని ఆర్‌ఎంఓ పావనిని ఆదేశించారు.