రోల్‌మోడల్‌గా కొడంగల్
ABN , Publish Date - Dec 24 , 2025 | 11:42 PM
కొడంగల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే రోల్‌మోడల్‌గా తీర్చి దిద్దుతానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
- ఏ పార్టీ మద్దతుతో గెలిచినా నా కుటుంబ సభ్యులే
- ఎన్నికల వరకే రాజకీయాలు, కక్ష సాధింపులకు తావులేదు
- అన్ని గ్రామాలకూ సమానంగా నిధుల మంజూరు
- సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి
కోస్గి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : కొడంగల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే రోల్‌మోడల్‌గా తీర్చి దిద్దుతానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా, కోస్గిలో బుధవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ సర్పంచుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొడంగల్‌ను విద్యా హబ్‌గా మార్చేందుకు లగచర్లలో 250 ఎకరాల్లో సైనిక్ స్కూల్, మెడికల్, ఇంజనీరింగ్, ఫార్మా కళాశాలల వంటి ఉన్నత విద్యాలయాలకు నిలయంగా మారుస్తామన్నారు. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలకోసం పారిశ్రామిక వాడ ఏర్పాటులో భాగంగా లగచర్లలో అందరినీ ఒప్పించి భూసేకరణ చేసి ఫార్మా సిటీ పనులను ప్రారంభించామన్నారు. నియోజకవర్గంలోని ప్రతీ పల్లెలో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఏ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచులైనా నా కుటుంబ సభ్యులేనన్నారు. వారి గ్రామాలకు కూడా సమానమైన నిధులు మంజూరు చేస్తామన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలను చూడాలని, ఆ తరువాత కక్ష సాధింపులు మాని, కలిసిమెలిసి అభివృద్ధి చేసుకోవాలన్నారు. తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని కేటీఆర్ చెప్తున్నారని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ సంపదను అడ్డగోలుగా దోచుకున్నారని విమర్శించారు. ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల ఫామ్‌హౌజ్, మోయినాబాద్‌లో హరీశ్ ఫామ్‌హౌజ్ ఎక్కడినుంచి వచ్చాయో చెప్పాలన్నారు. తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదని స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ప్రోత్సహిస్తున్నానని అన్నారు. కృష్ణ నీటి వాటాపై సమావేశం పెడతానంటున్నావు, పాలమూరు, రంగారెడ్డి, నల్గొండలలో మీటింగ్‌లు పెట్టుకోకుంటే, సంతకుపోయి బర్రెలను కొనుక్కొని కాసుకో అని కేసీఆర్‌పై మండిపడ్డారు. తాను రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్న కొడంగల్ నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో ఏమి జరుగుతోందో, ఏ సమస్యలు ఉన్నాయో తనకు తెలుసునన్నారు. ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నామని తెలిపారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో ఉదయం టిఫిన్ మధ్యాహ్నం సన్న బియ్యంతో భోజనం అందిస్తామన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలతో కాంగ్రెస్ పార్టీ బలోపేతమైందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి, సన్మానించడం నేటి సర్పంచుల అదృష్టమన్నారు. కాంగ్రెస్ హయాంలోనే మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి తెస్తారన్నారు. కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మల్మే కాలె యాదయ్య, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ శివకుమార్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, నియోజకవర్గ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.
పేరుపేరునా పిలిచి సన్మానం
ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరుపేరునా సర్పంచులను పిలిచి సన్మానిస్తూ ఉత్సాహపరిచారు. కొందరు కార్యకర్తలు ఫంక్షన్‌హాలు బయటనే ఉండటాన్ని గమనించిన సీఎం వారందరినీ లోపలకు పంపించండి అని పోలీసులను ఆదేశించారు. దీంతో కార్యకర్తలందరూ ఆనందంగా సమావేశం ఆవరణలోకి పరుగెత్తారు. అనంతరం సర్పంచులు, వారి కుటుంబ సభ్యులు, చిన్నారులను ఆప్యాయంగా పలుకరించారు. ఈ సందర్భంగా కొందరు ముఖ్యమంత్రికి పాదాభివందనం చేశారు.
సీఎం అండతోనే సర్పంచ్ పదవి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అండదండలతోనే సర్పంచ్‌గా ఎన్నియ్యానని కోస్గి మండలం, సర్జకాన్‌పేట సర్పంచ్ మౌనిక అన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడుతూ తాను చిన్న వయసులోనే సర్పంచ్‌నయ్యానని, రేవంత్ రెడ్డి చేసి అభివృద్ధి వల్లే, ప్రజలు నన్ను ఆశీర్వదించారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలోనే గ్రామం అభివృద్ధి చెందిందని తెలిపారు.