Share News

ఇష్టారాజ్యం

ABN , Publish Date - Jul 13 , 2025 | 11:14 PM

జోగుళాంబ గద్వాల జిల్లాలో గత కొంతకాలంగా ఇష్టానుసారంగా యాంటీబయాటిక్‌ మందుల విక్రయాలు తారాస్థాయికి చేరాయి.

ఇష్టారాజ్యం
గద్వాల జిల్లాలోని ఓ మెడికల్‌ దుకాణంలో మందులను పరిశీలిస్తున్న డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌(ఫైల్‌)

- గద్వాల జిల్లాలో యాంటీబయాటిక్‌ విక్రయాలు

-ఇటీవలే అధికారుల దాడుల్లో 16 మెడికల్‌ దుకాణాలకు నోటీసులు జారీ

- కాలపరిమితి దాటిన మందులు ఇవ్వడంతో ఓ మెడికల్‌ దుకాణం సీజ్‌

గద్వాల క్రైం, జూలై 13 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లాలో గత కొంతకాలంగా ఇష్టానుసారంగా యాంటీబయాటిక్‌ మందుల విక్రయాలు తారాస్థాయికి చేరాయి. గతంలో ఉన్న అధికారులు చుట్టపుచూపుగా కూడా గద్వాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో మెడికల్‌ ఏజేన్సీలు, మెడికల్‌ దుకాణాల ఆగడాలు తారాస్ధాయికి చేరాయి. గతంలో అధికారులు లేకపోవడంతో అధికారి కార్యాలయంలో తాత్కాలికంగా పనిచేసే ఓ ఉద్యోగే కీలక పాత్ర పోషించడం, ఏజేన్సీల నుంచి, మెడికల్‌ దుకాణాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

జిల్లాలో ముమ్మర దాడులు...

జోగుళాంబ గద్వాల జిల్లాలో గత కొన్ని ఏళ్లుగా పట్టించుకోని ఆధికారులు ఇటీవలే గత రెండు నెలల క్రితం బాధ్యతలు చేపట్టిన డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ మెడికల్‌ ఏజేన్సీలు, మెడికల్‌ దుకాణాలపై దాడులు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే జిల్లాలో మొత్తం 430 మెడికల్‌ దుకాణాలు, 40 మెడికల్‌ ఏజెన్సీలు ఉండగా, ఆయన వచ్చిన రెండు నెలల్లోనే ఇప్పటివరకు 46 మెడికల్‌ దుకాణాలపై దాడులు నిర్వహించి 16 మెడికల్‌ దుకాణాలపై 5 నుంచి 8 రోజుల పాటు సస్పెన్సన్‌ ఆర్డర్‌లు జారీ చేశారు. అంతేకాకుండా జిల్లా కేంద్రంలోని ఓ మెడికల్‌ దుకాణంలో కాలం చెల్లిన మందులు ఇచ్చినందుకు ఆ మెడికల్‌ దుకాణాన్ని సీజ్‌ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

మెడికల్‌ దుకాణాల్లో ఫార్మాసిస్ట్‌ లేకుంటే చర్యలు

జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇకపై నిబంధనలకు విరుద్ధంగా మెడికల్‌ దుకాణాలను నిర్వహిస్తే చర్యలు తప్పవని సంబంధిత అధికారి హెచ్చరించారు. ఇందులో ముఖ్యంగా మెడికల్‌ దుకాణాల్లో ఫార్మాసిస్ట్‌ తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఈ కింద వివరించిన అంశాలు తప్పనిసరి పాటించాలి.

- ప్రిస్కిప్షన్‌ లేకుండా మందులు విక్రయించరాదు

- యాంటీబయాటిక్‌ మందులు ఇవ్వకూడదు

- మెడికల్‌ దుకాణాలను ఆర్‌ఎంపీలు నిర్వహించరాదు

- ఉన్న మందులను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు పొందుపరిచేలా చూడాలి

గద్వాల మండలంలోని జమ్మిచేడులో మారని పరిస్థితి

గద్వాల జిల్లా కేంద్రంలోని జమ్మిచేడులో గతంలో ఓ ఆర్‌ఎంపీ లైసెన్స్‌ లేకుండా మందులు విక్రయిస్తుండటంతో హెచ్చరికలు జారీ చేసి, కేసులు కూడా నమోదు చేసినట్లు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌ తెలిపారు. అయితే గతంలో ఉన్న అధికారులు హెచ్చరించిగా వినకుండా మళ్లీ అదే తంతు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు రావడంతో అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు ఆయన తెలిపారు. అయితే ఎన్నిసార్లు హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో నేడో, రేపో మళ్లీ అతనిపై చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా సంబంధిత వ్యక్తి తాను ఆత్మహత్య చేసుకుంటానని సంబంధిత అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఈ విషయంపై సంబంధిత అధికారులకు, పోలీసులకు సమాచారం అందించనున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - Jul 13 , 2025 | 11:14 PM