పార్థీ గ్యాంగ్‌లో కీలక వ్యక్తి అరెస్టు
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:29 PM
దొంగతనాల్లో ఆరితేరిన పార్థీ గ్యాంగ్‌లోని ఓ కీలక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
- వివిధ రాష్ట్రాల్లో 50 నుంచి వంద నేరాలు
- 25.9 తులాల బంగారం రికవరీ
- వెల్లడించిన మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి
మహబూబ్‌నగర్/ పాలమూరు, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి) : దొంగతనాల్లో ఆరితేరిన పార్థీ గ్యాంగ్‌లోని ఓ కీలక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. కేసు వివరాలను మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సీ జానకి వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ రూరల్ పరిధిలో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళ 13 దొంగతనాలకు పాల్పడిన మహారాష్ట్ర జిల్లా, షోలాపూర్ నార్కెడ్‌కు చెందిన అమూల్ రాందాస్ పవార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 25.9 తులాల బంగారు నగలను రికవరీ చేశారు. చిన్నతనం నుంచే జల్సాలకు అలవాటు పడిన అమూల్ రాందాసు 25 ఏండ్లుగా దొంగతనాలు చేస్తున్నాడు. ఇతడిపై దేశంలో పలు రాష్ట్రాల్లో 50 నుంచి వంద వరకు నేరాలు ఉన్నాయి. కొన్ని చోట్ల వారెంట్లు ఉండగా, పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. జైలు నుంచి విడుదలైన తరువాత మహీంద్ర కారుతో పాటు, ఐ20 కారు కొనుగోలు చేశాడు. స్నేహితులు సచిన్, ఆకాష్‌బట్, ఆకాష్‌లతో కలిపి పలు రాష్ట్రాల్లో దొంగతనాలు చేశాడు. సినీఫక్కీలో కారు నెంబరు కనిపించకుండా స్టిక్కర్లు వేసి చోరీలకు పాల్పడతాడు. బండమీదిపల్లికి చెందిన బండారి లింగం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో దొంగిలించిన బంగారాన్ని శనివారం జడ్చర్ల ప్రాంతంలో విక్రయించేందుకు యత్నింస్తుండగా పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. అతడి నుంచి బంగారంతో పాటు, ఇళ్ల తాళాలు పగులగొట్టే కట్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీసు అధికారులకు ఎస్‌పీ రివార్డులు అందించారు. విచారణలో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ గాంధీనాయక్, జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జునగౌడ్, సీసీఎస్ సీఐ నాగరాజు, రూరల్ ఎస్‌ఐ విజయ్‌కుమార్, నవాబ్‌పేట ఎస్‌ఐ విక్రమ్, రూరల్ ఎస్‌ఐ-2 చంద్రమోహన్, కానిస్టేబుళ్లు లింగ్యానాయక్, రఘు, మహేందర్, శ్రీనివాస్, వెంకటేశ్, బాలచంద్రుడు, రఘు, గోపాల్, టెక్నికల్ సీఐ రియాజ్ అహ్మద్, ప్రవీణ్, రవి, శ్రీనివాస్, నిరంజన్‌లను ఎస్‌పీ అభినందించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ రాములు పాల్గొన్నారు.