కోటి దివ్వెల కార్తీకం
ABN , Publish Date - Nov 05 , 2025 | 11:07 PM
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలు దీపాల వెలుగులో కళకళలాడాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేసి, కార్తీక దీపాలను వెలిగించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం ఉమామహేశ్వర క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. రద్దీకి అనుగుణంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3 బస్సుల్లో భక్తులు కొండపైకి చేరుకున్నారు.
కోటి దివ్వెల కార్తీకం
భక్తిశ్రద్ధలతో పౌర్ణమి వేడుకలు
కృష్ణానదిలో బీచుపల్లి, సోమశిల వద్ద భక్తుల స్నానాలు
ఆలయాల్లో దీపారాధన
కురుమూర్తి ఆలయానికి ఇతర రాష్ట్రాల నుంచీ భక్తుల రాక
అచ్చంపేట/ కొల్లాపూర్/ అలంపూర్/ ఎర్రవల్లి (గద్వాల)/ చిన్నచింతకుంట/కృష్ణ/వనపర్తి రాజీవ్ చౌరస్తా, నవంబరు 5 : (ఆంధ్రజ్యోతి) : కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలు దీపాల వెలుగులో కళకళలాడాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేసి, కార్తీక దీపాలను వెలిగించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం ఉమామహేశ్వర క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. రద్దీకి అనుగుణంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3 బస్సుల్లో భక్తులు కొండపైకి చేరుకున్నారు. పాపనాశిని, నాగుల వైపు కొండచరియలు విరిగిపడి ఉండటంతో, ఆ మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆర్డీవో మాధవి ఈశ్వరుడిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాసులు, సీఐ నాగరాజు, ఎస్‌ఐ సద్దాంహుసేన్‌ల అద్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, ఈవో శ్రీనివాసులు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అలాగే నియోజకవర్గంలోని పల్కపల్లి శివాలయం, లింగాల కోదండరామాలయం, మద్దిమడుగు ఆంజనేయ స్వామి, ఉప్పునుంతల లక్ష్మీనరసింహ స్వామి ఆలయాల్లో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి, పూజలు చేశారు.
సోమశిలకు పోటెత్తిన భక్తజనం
కొల్లాపూర్ మండల పరిధిలోని సోమశిలకు భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన జనం ముందుగా సప్త నదుల సంగమ ప్రదేశం వద్ద కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించి, కార్తీక దీపాలను వెలిగించి నదిలో వదిలారు. అనంతరం లలితాంబికా సోమేశ్వర ఆలయంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలకు, ఆవరణలోని ఉసిరిచెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు కుంకుమార్చన చేశారు. భక్తులకోసం కొల్లాపూర్ డిపో నుంచి సోమశిలకు ప్రత్యేక బస్సులు నడిపించారు.
జోగుళాంబ సన్నిధిలో చండీహోమం
జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూరు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మవారి యాగశాలలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు చండీహోమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు చేసి, దీపాలను వెలిగించి నదిలో వదిలారు. అలాగే జోగుళాంబ, బాలబ్రహ్మేంద్ర స్వామి వార్లను దర్శించుకొని, ఆలయాల ఆవరణలో కార్తీక దీపాలను వెలిగించారు.
భక్తులతో కిటకిటలాడిన బీచుపల్లి
పవిత్ర పుణ్యక్షేత్రమైన బీచుపల్లికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామునే కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసి, ఆంజనేయ, ఈశ్వర, రామాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రధాన అర్చకుడు మారుతాచారి, ఈవో రామన్‌గౌడ్‌ల అధ్వర్యంలో కృష్ణానదికి దశవిధ హారతులతో ప్రత్యేక పూజలు చేశారు.
కురుమూర్తిలో ప్రత్యేక పూజలు
మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు బుధవారం అధిక సంఖ్యలో తరలొచ్చారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామి రాజగోపురం నుంచి గర్భగుడి వరకు మెట్టు మెట్టుకు దీపాలు వెలిగించి, మొక్కులు తీర్చుకున్నారు. దాసంగాలు సమర్పించారు. చిన్న వడ్డెమాన్ గ్రామ సమీపంలోని రామలింగేశ్వర స్వామి శివాలయంలో కార్తీక దీపాలు వెలిగించి, అభిషేకాలు చేశారు.
తంగిడిగి వద్ద
నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని తంగిడిగి వద్ద కృష్ణా నదిలో భక్తులు స్నానాలు చేశారు. కృష్ణ, భీమా నదుల సంఘం క్షేత్రంలోని దత్త భీమేశ్వర దేవాలయం, ముడుమాల్ యాదవేంద్ర స్వామి, కూసుమూర్తి శ్రీకృష్ణ ద్వాపయన దేవాలయం, స్వయంభు లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దీపాలు వెలిగించి, నదిలో వదిలారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో..
వనపర్తి జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి, న్యూగంజ్ లక్ష్మీ గణపతి దేవాలయం, రామాలయాలతో పాటు, రాజనగరం అయ్యప్ప స్వామి దేవాలయాల్లో కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. న్యూగంజ్ గణపతి గుడిలోని శివాలయంలో ఫస్ట్ అడిషినల్ జూనియర్ సివిల్ న్యాయాధికారి శ్రీలత కుటుంబ సభ్యులతో కలిసి అభిషేకం చేశారు.