కపాస్ కష్టాలు
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:33 PM
కపాస్ కిసాన్ యాప్‌తో పత్తి రైతులకు కష్టాలు తప్పడం లేదు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రైతులు పత్తిని విక్రయించుకోవాలంటే ఆ యాప్‌లో రైతులే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంది. అయితే ఒక కేంద్రం వద్ద రోజుకు 50 వాహనాల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తున్నారు.
పత్తి విక్రయానికి యాప్‌లో స్లాట్ నమోదుకాక రైతుల ఇబ్బందులు
రోజుల తరబడి పొలాలు, ఇళ్లలోనే పత్తి నిల్వ
నారాయణపేట జిల్లాలో 7 సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
సీసీఐ ఆధ్వర్యంలో 1,84,075 క్వింటాళ్లు, ప్రైవేటుగా 15,8,185.20 క్వింటాళ్ల పత్తి కొనుగోలు
నారాయణపేట, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): కపాస్ కిసాన్ యాప్‌తో పత్తి రైతులకు కష్టాలు తప్పడం లేదు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రైతులు పత్తిని విక్రయించుకోవాలంటే ఆ యాప్‌లో రైతులే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంది. అయితే ఒక కేంద్రం వద్ద రోజుకు 50 వాహనాల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దాంతో రోజుల తరబడి యాప్‌లో వివరాలు నమోదు కాక ఇబ్బందులు పడుతున్నామని రైతులు అంటున్నారు. దాంతో పత్తిని పొలాల్లో, ఇళ్ల వద్ద నిల్వ ఉంచుకుంటున్నామని వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో 1,63,082 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. 20,14,344 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా 7 పత్తి మిల్లుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మధ్యాహ్నంలోపే బుకింగ్స్ పూర్తి
రోజుకు ఒక మిల్లులో 50 వరకు వాహనాల్లోని పత్తినే కొనుగోలు చేస్తుండటంతో ఉదయం నుంచి మధ్యాహ్నంలోపే యాప్‌లో బుకింగ్స్ పూర్తవుతున్నాయి. ఆ తర్వాత యాప్‌లో నమోదు కాక, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దాంతో రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని పలువురు రైతులు అంటున్నారు. వివిధ అవసరాల రీత్యా నిరీక్షించలేని వారు ప్రైవేటు వ్యాపారులకు క్వింటాలుకు రూ.5,500 నుంచి రూ.7,000 వరకు విక్రయించుకుని నష్టపోతున్నారు. అదే సీసీఐ ఆధ్వర్యంలో క్వింటాల్‌కు మద్దతు ధర రూ.8,116 ఇస్తున్నారు.
మిల్లుల సామర్థ్యం మేరకు కొనుగోలు
అయితే జిల్లాలో మిల్లుల సామర్థ్యాన్ని బట్టి పత్తిని కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. స్లాట్‌బుక్ అయిన తర్వాత విక్రయానికి వారం రోజులు పడుతుందని అంటున్నారు. రోజుకు 7 మిల్లుల్లో ఎనిమిదిన్నర వేల క్వింటాళ్ల పత్తిని కొంటున్నట్లు తెలిపారు. మిల్లుల్లో పత్తి నిల్వలు సైతం అధికంగా ఉన్నాయని అంటున్నారు.
1,84,075 క్వింటాళ్ల పత్తి కొనుగోలు
జిల్లాలోని ఏడు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 1,83,075 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేశారు. 1,0132 మంది రైతుల నుంచి దానిని కొన్నారు. ప్రైవేటులో 15,8,185.20 క్వింటాళ్ల పత్తిని కొన్నారు.