Share News

కాళోజీ సేవలు మరువలేనివి

ABN , Publish Date - Sep 09 , 2025 | 11:04 PM

ప్రజా కవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివి అని కలెక్టర్‌ విజయేందిర బోయి అన్నారు.

కాళోజీ సేవలు మరువలేనివి
కాళోజీ చిత్ర పటానికి నివాళి అర్పిస్తున్న కలెక్టర్‌ విజయేందిర బోయి

- కలెక్టర్‌ విజయేందిరబోయి

మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌/మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం/జడ్చర్ల/రాజాపూర్‌/దేవరకద్ర, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : ప్రజా కవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివి అని కలెక్టర్‌ విజయేందిర బోయి అన్నారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కాళోజీ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ హాజరై, ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కాళోజీ చిత్ర పటానికి అదనపు కలెక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డితో కలిసి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి కాళోజీ తెలంగాణకు చేసిన సేవలను కొనియాడారు. తన కవిత ద్వారా ప్రజల ఆవేదన, ఆగ్రహాన్ని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. ఆంధ్ర సారస్వతి పరిషత్‌ వ్యవస్థాపక సభ్యుడిగా, ఆంధ్రపరదేశ్‌ సాహిత్య అకాడమీ సభ్యుడిగా సేవలందించారన్నారు. గృహ నిర్మాణ శాఖ పీడీ వైద్యం భాస్కర్‌, కలెక్టరేట్‌ ఏవో సువర్ణరాజ్‌, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని బీఎడ్‌ కళాశాలలో కాళోజీ చిత్రపటానికి కళాశాల సూపరింటెండెంట్‌ రామకృష్ణరావు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎంవీఎస్‌ డిగ్రీ పీజీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ డా.పద్మావతి, ఎన్టీఆర్‌ మహి ళ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ రాజేంద్రప్రసాద్‌ కాళోజీ చిత్ర పూలమాల వేసి నివాళి అర్పించారు. జడ్చర్ల మండలం కోడ్గల్‌ జడ్పీహెచ్‌ఎస్‌లో కాళోజీ చిత్రపటానికి నివాళి అర్పించి, తెలుగు ఉపాధ్యాయులు మల్లిఖార్జున్‌, కృష్ణను సత్కరించారు. జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుకన్య, అధ్యాపకులతో కలిసి కాళోజీ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఆలూరులో విద్యార్థులకు ఉపన్యాసం, వ్యాసరచన, పద్యపఠనం, క్విజ్‌ పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులు అందచేశారు. రాజాపూర్‌ మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి తహసీల్దార్‌ రాధాకృష్ణ, డీటీ భారతి, సిబ్బంది యాదగిరి, సత్యం, శ్యామల, నాయకులు నరహరి, వెంకటయ్య, పూలమాల వేసి నివాళి అర్పించారు. దేవరకద్ర మండల కేంద్రంలోని తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాల్లో తహసీల్దార్‌ దీపిక, ఎంపీడీవో శ్రీనివాస్‌రావు, ఆర్‌ఐ శరత్‌ నివాళి అర్పించారు.

Updated Date - Sep 09 , 2025 | 11:04 PM