Share News

బాధితులకు న్యాయం చేయాలి

ABN , Publish Date - Sep 22 , 2025 | 11:30 PM

ప్రతీ కేసును పారదర్శకంగా విచారణ చేసి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జోగుళాంబ జోన్‌ డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌ చెప్పారు.

బాధితులకు న్యాయం చేయాలి

కేసులపై పారదర్శకంగా విచారణ జరపాలి

జోగుళాంబ జోన్‌ డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌

మహబూబ్‌నగర్‌/ గండీడ్‌/ మహమ్మదాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రతీ కేసును పారదర్శకంగా విచారణ చేసి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జోగుళాంబ జోన్‌ డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌ చెప్పారు. వార్షిక తనిఖీలో భాగంగా సోమవారం ఆయన జిల్లాలోని పలు పోలీస్‌ స్టేషన్‌లను తనిఖీ చేశారు. మహ్మదాబాద్‌, మహబూబ్‌నగర్‌ రూరల్‌ స్టేషన్‌లను, డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఆయా స్టేషన్‌లలో రికార్డులను పరిశీలించారు. కేసుల వివరాలు, పెండింగ్‌ కేసులపై ఆరా తీశారు. సైబర్‌ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండేలా, సోషల్‌ మీడియాలో జరుగుతున్న మోసాలు, పోక్సో చట్టం, సీసీ కెమెరాల అవశ్యకత గురించి పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రాబోయే స్థానిక ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మైనర్లు బైక్‌ నడిపి పట్టుబడితే వారి తల్లిదండ్రులపైనా కేసులు నమోదవుతాయని చెప్పారు. శ్రద్ధ, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలన్నారు. పోలీస్‌ స్టేషన్‌లలో రికార్డుల నిర్వహణ, సౌకర్యాలు, పరిపాలనతోపాటు శాంతి భద్రతలను సమీక్షించారు. తనిఖీల్లో అదనపు ఎస్పీ ఎన్‌బీ రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, రూరల్‌ సీఐ గాంధీనాయక్‌, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2025 | 11:30 PM