వక్ఫ్ సవరణ చట్టంతో పేద ముస్లింలకు న్యాయం
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:21 PM
పార్లమెంటులో చేసిన వక్ఫ్ సవరణ చట్టం వలన పేద ముస్లింలకు న్యాయం జరుగుతుందని, దీన్ని ముస్లింలు గుర్తించాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు.
- మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
గద్వాల, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటులో చేసిన వక్ఫ్ సవరణ చట్టం వలన పేద ముస్లింలకు న్యాయం జరుగుతుందని, దీన్ని ముస్లింలు గుర్తించాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని డీకే బంగ్లాలో వక్ఫ్ సవరణ చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ముస్లిం నిరుపేదలకు న్యాయం చేసేందుకు ఏర్పడిన ధార్మిక సంస్థనే వక్ఫ్ చట్టమని, ఇది వందల ఏళ్ల నుంచి కూడా పేదలకు న్యాయం చేసే లక్ష్యం నెరవేర్చలేదన్నారు. వక్ఫ్ బిల్లు సవరణ భవిష్యత్‌లో ముస్లిం సమాజానికి ఆర్థిక ప్రగతి కారకంగా ఉపయోగపడుతుందని వివరించారు. కొందరు ముస్లిం పెద్దల కబంధ హస్తాలలో వక్ఫ్ బంధీ అయిపోయిందని వివరించారు. తాము నిరుపేద ముస్లింలకు న్యాయం చేస్తామంటే కాంగ్రెస్‌తో చేతులు కలిపి ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. వక్ఫ్ పేరుతో అవినీతి జరుగుతోందని, అమాయకులు నష్టపోతున్నారని, ఈ విషయాలన్నీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి రావడంతో సవరణ చేసినట్లు చెప్పారు. 2018 రిపోర్టు ప్రకారం ఈ దేశం లో 80 లక్షల ఎకరాల వక్ఫ్ ఆస్తులు ఉన్నట్లు తేలిందన్నారు. కశ్మీర్ పెహల్గామ్ ఘటనను భారతీయులు ముక్తకంఠంతో ఖండించాలని సూచించారు. ఐక్యంగా ఉండి ఉగ్రవాదాన్ని రూపుమాపాలని కోరారు. ఈ సదస్సులో రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు అప్సర్ పాషా, బీజేపీ జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి డీకే స్నిగ్దారెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అక్కల రమాదేవి, బండల వెంకట్రాములు, జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు మాలిమ్ ఇసాక్, మైనార్టీ మోర్చా నాయకులు మోహిద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.