కాటికి తీసుకెళ్లేందుకూ కష్టాలే
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:18 PM
మరణించిన వారి అంతిమ యాత్ర అయినా, కాటికి చేర్చాలన్నా చనిపోయిన వారి బంధువులు పడుతున్న కష్టాలు అంతా ఇంతా కావు.
- అంత్యక్రియలు చేయాలంటే వాగు దాటాల్సిందే
- శ్మశానవాటికకు సరైన దారి లేక అవస్థలు
- పాడెమోస్తూ అలుగు దాటిన కుటుంబ సభ్యులు
ఊట్కూర్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): మరణించిన వారి అంతిమ యాత్ర అయినా, కాటికి చేర్చాలన్నా చనిపోయిన వారి బంధువులు పడుతున్న కష్టాలు అంతా ఇంతా కావు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం పగిడిమారి గ్రామంలో నర్సిములు(50), అశ్విని(13)అనే ఇద్దరితో పాటు మరో ఒకరు శనివారం చనిపోయారు. వారిని గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాల యంలో వెనుక భాగంలో ఉన్న శ్మశానవాకిటికి తీసుకెళ్లాలంటే వాగు దాటాల్సిన పరిస్థితి. దీంతో వచ్చిన వారు సైతం వాగు వరకే రావడంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేయడానికి మోకాళ్ల లోతులో నీరు ప్రవహిస్తున్న వాగులో పాడెను మోస్తూ దాటి.. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలో కొత్తగా నిర్మించిన దహనవాటిక దూరంగా ఉండటంతో గ్రామంలోని ఆంజనేయస్వామి వెనుకభాగంలో ఉన్న పాత శ్మశానవాటికలో ప్రజలు అం త్యక్రియలు నిర్వహించారు. ఈ శ్మశాన వాటికికకు సరైన దారి లేకపోవడంతో చనిపోయిన వారిని తీసుకెళ్లడానికి కష్టాలు పడాల్సి వస్తున్నదని గ్రామస్థులు వాపోయారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు సైతం శ్మశాన వాటికకు నేటికీ రోడ్డు సౌకర్యం లేకపోవడంపై మాట్లాడుకోవడం కనిపించింది. ఇప్పటికైనా అధికారులు పాత శ్మశాన వాటికకు రోడ్డు వసతి కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.